ఢిల్లీలో (Delhi) భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party), ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) మధ్య పోస్టర్ల, సోషల్ మీడియా యుద్ధం సాగుతోంది. ఢిల్లీలో హఠాత్తుగా మోడీ హఠావో... దేశ్ బచావో అంటూ వేల పోస్టర్లు వెలుగు చూశాయి.
ఢిల్లీలో (Delhi) భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party), ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) మధ్య పోస్టర్ల, సోషల్ మీడియా యుద్ధం సాగుతోంది. ఢిల్లీలో హఠాత్తుగా మోడీ హఠావో… దేశ్ బచావో అంటూ వేల పోస్టర్లు వెలుగు చూశాయి. దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు 36 కేసులు నమోదు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ఇద్దరు ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఉన్నారు. మంగళ వారం ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో 2000 పోస్టర్ల వరకు మోడీకి వ్యతిరేకంగా వెలిశాయి. ఇందులో ఎక్కువగా మోడీ హఠావో… దేశ్ బచావో అని ఉంది. ఇందులో చాలా పోస్టర్లను ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి (Aam Aadmi Party Office) కూడా ఓ వాహనంలో పంపించినట్లుగా తెలుస్తోంది. ఈ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.
తమకు 50,000 పోస్టర్లు తయారు చేయాలని ఆర్డర్ వచ్చినట్లు ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పోలీసుల విచారణలో చెప్పారు. పోస్టర్ల పైన ప్రింటింగ్ ప్రెస్ పేరు లేకపోవడం కూడా గమనార్హం. పోస్టర్లు పెడితే అరెస్ట్ చేయడం ఏమిటని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించింది. అసలు ఆ పోస్టర్లను తామే వేయించామని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకునే ధైర్యం కూడా చేయడం లేదని, ఈ పోస్టర్లను అంటించడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ట్విట్టర్ లో మోడీ హఠావో… దేశ్ బచావో ట్రెండింగ్ అవుతోంది. ఢిల్లీ బచావో అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా కూడా ట్విట్టర్ ట్రెండ్ అవుతోంది. తన నగరాన్ని గ్యాస్ ఛాంబర్ గా మార్చిన వాడిలో మొదటివాడు హిట్లర్ అయితే, రెండోవాడు కేజ్రీవాల్ అంటూ దేశ రాజధానిలో పోస్టర్లు వెలిశాయి. పంజాబ్ లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కనుక ఉండి ఉంటే… ఇప్పటికే అమృత్ పాల్ కోసం వెతికే పని తప్పేదని, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కాబట్టి వైఫల్యం కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. కేజ్రీవాల్ హఠావో… ఢిల్లీ బచావో అని ట్రెండింగ్ చేస్తున్నారు.