»Bandi Sanjay To Attend Before Womens Commission On 18th
Bandi Sanjay: 18న విచారణకు బండి, అరవింద్ కు బీజేపీ నోటీసులు?
కవిత పైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదని ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం నుండి ఆయనకు నోటీసులు రావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharatha Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)ను ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) తెలంగాణ అధ్యక్షులు (Telangana BJP president) బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Nizamabad MP Dharmapuri Arvind), పార్టీ సీనియర్ పేరాల శేఖర్ (Perala Sekhar)లు కూడా ఆ వ్యాఖ్యలతో విబేధించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీలోను చిచ్చు పెట్టాయి. తెలంగాణలోని సామెతను బండి సంజయ్ ఉపయోగించారు. కవితను ఈడీ అరెస్ట్ చేస్తుందా.. చర్యలు తీసుకుంటుందా అంటే… ఈడీ అరెస్ట్ చేయకుంటే ముద్దు పెట్టుకుంటుందా అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యానించినా మూడు నాలుగు రోజుల తర్వాత బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేపట్టారు. ఈ ప్రాంతంలోని సాధారణ సామెతను వ్యాఖ్యానిస్తే బీఆర్ఎస్ నేతలతో పాటు సొంత పార్టీ నేతలు ఇరుకున పడేలా వ్యాఖ్యలు చేయడంపై తెలంగాణ బీజేపీ కార్యకర్తలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్మపురి అరవింద్, పేరాల శేఖర్ తీరును తప్పుబడుతున్నారు. అంత చిన్న మాటకు.. ఇలాంటి సమయంలో అండగా ఉండాల్సింది పోయి.. అధ్యక్షుడి వ్యాఖ్యలను సమర్థించనని మాట్లాడటం ఏమిటని భగ్గుమంటున్నారు.
కవిత మీద చేసిన వ్యాఖ్యలకు గాను తెలంగాణ మహిళా కమిషన్ సునితా రెడ్డి (telangana women’s commission chairperson Sunitha Reddy) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలను సుమోటాగా తీసుకున్నది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీ అంజనీ కుమార్ ను మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరు కానున్నట్టుగా రాష్ట్ర మహిళా కమిషన్ కు మంగళవారం నాడు లేఖ రాశారు. ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ నోటీసులకు సంజయ్ నేడు సమాధానం పంపారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని, ఈ కారణంగా ఈ నెల 15వ తేదీన విచారణకు రాలేనని ఆ లేఖలో పేర్కొన్నారు. 18న హాజరవుతానని చెప్పారు. బండి సంజయ్ పైన బీఆర్ఎస్ నేతలు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
మహిళా కమిషన్ తీరుపై (telangana women’s commission) సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ తమిళసైని దారుణంగా మాట్లాడితే స్పందించ లేదని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో మహిళలపై దాడులు జరుగుతుంటే మహిళా కమిషన్ ఎక్కడకు వెళ్లిందని ప్రశ్నిస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య సహా వివిధ అధికార పార్టీ నాయకులు మహిళలను వేధిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయని, వాటి పైన ఎప్పుడైనా స్పందించిందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ తెలంగాణలో సహజంగా ఉన్న ‘కొట్టకుంటే ముద్దు పెట్టుకుంటారా’ అనే సామెతను అరెస్ట్ చేయకుంటే ముద్దు పెట్టుకుంటారా అని వ్యాఖ్యానించినంత మాత్రాన నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.
ధర్మపురి అరవింద్ కు నోటీసులు
కవిత పైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదని ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం నుండి ఆయనకు నోటీసులు రావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.