ట్రాఫిక్ చలానాలు కట్టలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నల్లగొండ జిల్లా నేరడిగొమ్ము గ్రామానికి అన్నెపాక ఎల్లయ్య (52), మల్లమ్మ దంపతులు బతుకుతెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి ఐఎస్ సదన్ డివిజన్ నీలం రాజశేఖర్ రెడ్డి నగర్ (చింతల్ బస్తీ)లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఎల్లయ్య హమాలీగా, మల్లమ్మ చంపాపేటలోని సాయిబాబా గుడిలో పనిచేస్తున్నారు. పలు చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో మీర్‌చౌక్ పోలీసులు ఎల్లయ్య బైక్‌ను సీజ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఎల్లయ్య సోమవారం రాత్రి ఇంటికి వచ్చి విషం తాగి అత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే డీఆర్డీఓ ఒవైసీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
చలాన్ల సొమ్ము రూ.10 వేలు కడితేనే బండి ఇస్తానని ట్రాఫిక్ ఎస్సై చెప్పాడని, కూలీ పనులు చేసుకునే తనకు అంత సొమ్ము చెల్లించలేనని ఎంత బతిమాలినా వినలేదని, పైగా టార్చర్ పెట్టాడని సూసైడ్ నోట్లో రాశాడు. విచ్చలవిడిగా వేస్తున్న చలాన్లతో పేదలు నానా అవస్థలు పడుతున్నారని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేసీఆర్, కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశాడు.సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.