విదేశాంగ మంత్రి జైశంకర్ (S. Jaishankar) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ( Congress Party) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు.
విదేశాంగ మంత్రి జైశంకర్ (S. Jaishankar) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ( Congress Party) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు. చైనాది పెద్ద ఎకానమీ, మనది చిన్న ఎకానమీ. వారితో వెళ్లి యుద్ధం చేయాలా అని జై శంకర్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఇదేనా జాతీయ వాదం అని అని ప్రశ్నించారు. చైనాకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పిరికిపందలా లొంగిపోయిందని ధ్వజమెత్తారు. ఇందుకు జైశంకర్ ప్రకటనే సాక్ష్యమన్నారు. మనకంటే బలవంతులు ఉంటే లొంగిపోతామా, మనకంటే బలహీనుల పైనే పోరాడతామా.. ఇదేం తీరు అని నిలదీశారు. ఇది సావర్కర్ సిద్ధాంతం కావొచ్చునని ఎద్దేవా చేశారు. బ్రిటిష్ వారిది మనకంటే బలమైన ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ పోరాడి స్వాతంత్య్రం తెచ్చుకున్నామని గుర్తుచేశారు. కాంగ్రెస్ వాదులు సత్యాగ్రహులు, బీజేపీ నేతలు అధికారవాదులు అని విమర్శించారు. రాయ్‌పూర్(raipur)లో జరుగుతున్న పార్టీ 85వ ప్లీనరీ సమావేశం(85th plenary meetings)లో భాగంగా వ్యాఖ్యానించారు. ప్రధాని పైన కూడా నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.
కాశ్మీర్లో ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటించినపుడు వేలాది మంది త్రివర్ణ పతాకాలతో ముందుకొచ్చారని చెప్పారు. పార్లమెంటులో తాను ఇదే విషయం చెబితే.. తాను ఎప్పుడో లాల్‌చౌక్‌లో జెండా ఎగురవేశానని మోడీ అన్నారని, అసలు నేను ఏం చెప్పానో మోడీకి అర్థమే కాలేదన్నారు. లాల్‌చౌక్‌లో మోడీ త్రివర్ణ పతాకం ఎగురవేసి ఉండొచ్చు కాని.. కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల గుండెల్లో త్రివర్ణ పతాకం ఎగురవేసిందన్నారు. కాశ్మీర్ యువతలో మేం ప్రేమ అనే త్రివర్ణ పతాకం రెపరెపలాడించామని, బీజేపీ దానిని లాగేసుకుందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో బిలియనీర్ గౌతమ్ అదానీ(adani)కి బీజేపీ(bjp) నేతలు ఎందుకు అండగా నిలుస్తున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(rahul gandhi) ఆరోపించారు. ప్రధాని మోడీ, అదానీ ఒక్కటేనని విమర్శించారు.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికలకు ముందు మరో యాత్రను చేపట్టనున్నారు. జూన్ లేదా నవంబర్ నెలలకు ముందు ఈ యాత్ర ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే దేశంలో తూర్పు నుంచి పశ్చిమానికి మరో యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. భారత్ జోడో యాత్రతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పారు. కేడర్ లోని ఈ కొత్త శక్తిని అలాగే కొనసాగించేలా మరోయాత్ర చేసేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోందని చెప్పారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాసిఘాట్ నుంచి గుజరాత్‌లోని పోరుబందర్ వరకు ఈ యాత్ర ఉంటుందన్నారు. ఈ రూట్లో అడవులు, నదులు ఉండడంతో జోడోయాత్రతో పోల్చితే ఈ యాత్ర కొంత భిన్నంగా ఉంటుందని, ఎక్కువ శాతం పాదయాత్ర ఉన్నప్పటికీ కొంతవరకు బహుళ విధాలుగా సాగుతుందన్నారు.