YSRCP మాజీ ఎమ్మెల్యే ఆకస్మిక మృతి.. సీఎం జగన్ దిగ్భ్రాంతి
రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం రాత్రి 10 గంటల వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో గుండెపోటుకు గురయ్యారు.
మహా శివరాత్రి పర్వదినాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)లో విషాదం అలుముకుంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ (AP Kshatriya Corporation) పాతపాటి సర్రాజు (72) ఆకస్మిక మృతి చెందారు. వివాహ వేడుకకు హాజరై వచ్చిన ఆయన పార్టీ నాయకులతో సమావేశమై ఇంటికి వెళ్లారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున కన్నుమూశారు.
క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు (Pathapati Sarraju) శుక్రవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీమవరం (Bhimavaram)లో రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం రాత్రి 10 గంటల వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సర్రాజు తుదిశ్వాస విడిచారు. కాగా ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతికి మంత్రులు, వైఎస్సార్ సీపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సంతాపం ప్రకటించారు.
పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)కు చెందిన పాతపాటి సర్రాజు 2004లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి ఉండి నియోజకవర్గంలో పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో చెరగని ముద్ర వేశారు. ఇక 2009 ఎన్నికల్లో మళ్లీ ఉండి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. రాష్ట్ర విభజనతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం జరిగిన 2019 ఎన్నికల్లో ఫ్యాన్ (Fan) గుర్తుపై ఉండి నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. రెండో సారి కూడా అతడికి పరాజయం పలకరించింది. అయినా కూడా వైఎస్సార్ సీపీతోనే కొనసాగుతున్నారు. 2019లో అతడికి వైఎస్ జగన్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. మాజీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయనకు అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. క్షత్రియ సామాజిక వర్గానికి సర్రాజు విశేష సేవలు చేశారు. వైఎస్సార్ సీపీకి పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక నాయకుడిగా వ్యవహరించారు. మారిన రాజకీయ పరిస్థితులతో ఆయనకు ఉండి టికెట్ ఇవ్వకపోయినా ఆయన సేవలను మాత్రం పార్టీ వినియోగించుకుంది. అందుకే గుర్తించి మరీ ఆయనకు 2021లో కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించారు. సీఎం జగన్ వెన్నంటే ఉన్నాడు.
సీఎం జగన్ సంతాపం
క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సర్రాజు మృతికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సర్రాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా ఆయన భౌతికకాయానికి నివాళులర్పించేందుకు సీఎం జగన్ భీమవరం చేరుకుంటారని సమాచారం. కుటుంబసభ్యులను ఓదార్చేందుకు సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తారని వైఎస్సార్ సీపీ నాయకులు చెబుతున్నారు.