ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ ‘పుష్ప2’కు రంగం సిద్దమవుతోంది. అయితే ఈ సారి బన్నీ సొంత స్టూడియోలో పుష్పరాజ్ సెకండ్ ఎంట్రీ ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్లో అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియో, దగ్గుబాటి వారి రామానాయుడు.. ఘట్టమనేని వారి పద్మాలయా.. నందమూరి వారి రామకృష్ణా స్టూడియోలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే రామోజీ ఫిలిం సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన బడా హీరోల సినిమాలన్నీ దాదాపుగా ఈ స్టూడియోస్‌లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలలో ఓపెనింగ్లు మరియు ఇన్ డోర్ షూటింగ్‌లు జరుగుతుంటాయి. ఔట్ డోర్ షూట్ వచ్చేసి ఆర్ఎఫ్సిలో జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు స్టూడియో రంగం సిద్దమైంది. అల్లు వారి ఫ్యామిలీ నుంచి వస్తున్న ఫస్ట్ స్టూడియో ఇదే కానుందని చెప్పొచ్చు. ఇప్పటికే ‘అల్లు స్టూడియోస్’పేరుతో సువిశాలమైన స్థలంలో అల్లు అరవింద్ ఈ స్టూడియోని స్టార్ట్ చేశారు. అన్ని విధాల షూటింగ్‌లకు అనువుగా ఈ స్టూడియోని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. తాజాగా ‘అల్లు స్టూడియోస్’ నిర్మాణం పూర్తయినట్టు తెలుస్తోంది. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 1న, ఈ స్టూడియోని ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ స్టూడియోలోనే పుష్ప2 షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని టాక్. అతి త్వరలో దీని గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.