విశాఖ నచ్చితే వీకెండ్ వెళ్లాలని సీఎం జగన్కు రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సూచించారు. ఇటీవల విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని జగన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. దీంతో రఘురామ కృష్ణరాజు స్పందించారు. జగనన్న విశాఖ వెళతారనే చర్చ రాష్ట్రమంతా నడుస్తోందని అన్నారు. రాజు ఎక్కడుంటే అదే రాజధాని కాదని రఘురామ కామెంట్ చేశారు. రాజధానిపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి మార్పు ఉండబోదని రఘురామ స్పష్టం చేశారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో విశాఖ పరిపాలన రాజధాని అని సీఎం జగన్ కామెంట్ చేశారు. తాను కూడా షిప్ట్ అవుతానని.. కంపెనీలను కూడా ఆహ్వానించారు. ఇది వైఎస్ వివేకానంద కేసు దృష్టి మరల్చేందుకేనని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆ సమయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది. రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా ఎలా మాట్లాడతారని నేతలు ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్ల నుంచి రాజధాని మార్పు అంశంపై జగన్ దృష్టిసారించారు. కమిటీ సూచనల మేరకు అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. మండలిలో అప్పటి చైర్మన్ షరీఫ్ అడ్డుకున్నారు. ఇంతలో అమరావతి రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజధాని మార్చొద్దని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
హైకోర్టు తీర్పును జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై వాదోప వాదనలు జరుగుతున్నాయి. తుది తీర్పు రావాల్సి ఉంది. ఇంతలో విశాఖ పరిపాలన రాజధాని అని జగన్ అనడం.. మిగతా మంత్రులు/ నేతలు సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని అంటున్నారు.