MAA Association: విచ్చలవిడి యూట్యూబ్ కంటెంట్, థంబ్‌నైల్స్‌పై ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. మహిళల పట్ల, చిన్న పిల్లల పట్ల ఎంతో శ్రద్దతో ఉండాలని, అలా లేని డిజిటల్ కంటెంట్‌ను తొలిగించే ప్రయత్నం చేస్తున్నట్లు ఇదివరకే అధికారులు చెప్పారు. తాజాగా మా అసోసియేషన్ 18 యూట్యూబ్ ఛానెళ్లను బ్యాన్ చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది. మూవీ ఆర్టిస్టులు, ముఖ్యంగా బడా హీరోలపై, సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వార్నింగ్ ఇస్తూ వచ్చింది. అయినా వినకపోవడంతో ఈ మధ్యనే ఐదు యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ద్వారా చర్యలు చేపట్టారు. దాంతో ఆయా ఛానళ్లలో కంటెంట్ గమనించి వాటిని పూర్తిగా తొలగించారు. అయినా వినకపోవవడంతో మరొక 18 ఛానెళ్లను తొలగిస్తూ మా నిర్ణయం తీసుకుంది. వాటి పేర్లు, యూట్యూబ్ ఛానల్ యుఆర్ఎల్స్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
సినిమా ఆర్టిస్టుల మీద, వాళ్ల వ్యక్తిగత జీవితాలపై ఇష్టరీతిలో కంటెంట్ క్రియేట్ చేసిన వాటిని తొలగిస్తున్నామని వెల్లడించింది. ‘ఇబ్బందికరంగా ఉన్న ట్రోల్ వీడియోస్ మీద ఒక రిపోర్ట్ తయారు చేసి సైబర్ క్రైమ్ ఆఫీస్‌కి అందచేయబోతున్నాం. నటీనటులను కించపరిచే వీడియోలను తొలగించాల్సిందిగా ఇతర ఛానెళ్లను కూడా హెచ్చరిస్తున్నాం.” అని ‘మా’ పేర్కొంది. దీనికి పలువురు సినిమా యాక్టర్లు పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఇది కచ్చితంగా మంచి విషయమని అంటున్నారు. ఇకనైన మంచి కంటెంట్ చూడొచ్చు అని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. చిన్నపిల్లలపై, మహిళలపై అసభ్యకరమైన కంటెంట్ క్రియేట్ చేస్తే ఊరుకునేది లేదని మా అసోసియేషన్ హెచ్చరించింది.