బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్‌కు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. గత కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్ చేసిన సినిమాలన్నీ బాక్సీపీసు వద్ద బోల్తా పడుతున్నాయి. నిర్మాతలకు భారీ నష్టాలను మిగుల్చుతున్నాయి. తాజాగా వచ్చిన సర్ఫిరా సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అక్షయ్ కుమార్ ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పరాజయాల పరంపర నుంచి అక్షయ్ కుమార్ ఎందుకు బయట పడలేకపోతున్నాడు? అక్షయ్ స్వయం కృతాపరాధమే కారణమా? ఈ విషయమై విమర్శకులు ఏం అంటున్నారు? తెలుసుకుందాం.
Akshay Kumar: హీరో అక్షయ్ కుమార్… ఫ్లాప్ హీరోగా మారిపోయాడు. గతంలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన అక్షయ్.. ఇటీవల కాలంలో ప్రేక్షకుల నుంచి తిరస్కారానికి గురౌతున్నాడు. బడే మియా చోటే మియా, బెల్ బోటమ్, లక్ష్మీ బాంబ్, మిషన్ రాణీ గంజ్, సమ్రాట్ పృథ్వీరాజ్ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా వచ్చిన సర్ఫిరా సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. నిజానికి సర్ఫిరా అనే ఓ సినిమా వచ్చిందని చాలామంది ప్రేక్షకులకి తెలియదు. చడీ చప్పుడు లేకుండా వచ్చిన ఆ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అడ్వాన్స్ బుకింగుల రూపంలో ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్లు 30 లక్షలు మాత్రమేనని తెలుస్తోంది. గతంలో ఓ వెలుగు వెలిగిన అక్షయ్ కుమార్ ఈ రేంజ్ కలెక్షన్లు రావడం బాలీవుడ్ దీనపరిస్థితికి నిలువెత్తు నిదర్శనం.
సర్ఫిరా సినిమాకలెక్షన్లను ఓసారి పరిశీలిస్తే ఆ సినిమాకు ఎటువంటి ఆదరణ లభిస్తోందో స్పష్టంగా అర్ధమౌతోంది. మొదటిరోజు వసూళ్లు కేవలం 2.4 కోట్లు మాత్రమే ఉన్నాయి. అక్షయకుమార్ గత సినిమాలు ఏవీ కూడా ఈ రేంజుకు పడిపోలేదు. అక్షయ్ కుమార్ ఈ సినిమా చేయకుండా ఉండాల్సిందని కొందరు సినీ పండితులు భావిస్తున్నారు. తమిళంలో సూర్య హీరోగా, అపర్ణా బాలమురళి హీరోయిన్గా చేసిన సూరారై పొట్రు సినిమాకు సర్ఫరా సినిమా రీమేక్. ఇప్పటికే ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే పేరుతో డబ్ అయి హిట్ కూడా అయింది. తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించారు. మణిరత్నం వద్ద శిష్యరికం చేసిన సుధా కొంగర ఆకాశం నీ హద్దురా సినిమాకు దర్శకురాలు. హిందీలో కూడా సుధా కొంగరే దర్శకత్వం చేసింది. తమిళ ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చిన ఆ కథ హిందీ ప్రేక్షకులకు నచ్చలేదు. ఇప్పటికే లక్షలాది మంది ప్రేక్షకులు ఆ సినిమాను యూట్యూబ్‌లో చేసేశారు.
సాధారణ ప్రజలకు కూడా విమాన ప్రయాణం అందుబాటులో ఉండాలని తపించిన ఎయిర్ డెక్కన్ ఫౌండర్ రామస్వామి అయ్యంగార్ గోపీనాథ్ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఆకాశం నీ హద్దురా. ఈ సినిమా గత కొంత కాలంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమాను ఇప్పటికే లక్షలాది మంది ప్రేక్షకులు చూసేశారు. ఆల్రెడీ డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉన్నప్పుడు ఇక కొత్తగా హిందీలో వచ్చిన ఆ సినిమాలో థ్రిల్ ఏముంటుంది..? సూరారై పొట్రు హిందీ డబ్బింగ్ రైట్స్ ను గోల్డ్ మైన్స్ టెలిఫిలిమ్స్ సంస్థ తీసుకుంది. ఉడాన్ పేరిట హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను సిద్ధం చేసింది. ఇటీవలే ఆ డబ్బింగ్ వెర్షన్‌ను యూట్యూబులో పెట్టింది. దీంతో అక్షయ్ కుమార్ సినిమాకు దెబ్బ పడింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ టైమ్ బ్యాడ్‌గా నడుస్తుంది.