ప్రముఖ సింగర్ వాణీ జయరాం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణంపై పలు అనుమానాలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వాణీ జయరాం నుదుటిపై గాయాలు ఉండటంతో ఆమె భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆదివారం తమిళనాడులో ప్రభుత్వ లాంఛనాల మధ్య వాణీ జయరాం అంత్యక్రియలు ముగిశాయి.
సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. 78 ఏళ్ల వాణీ జయరాం భర్త 2018లో మరణించారు. అప్పటి నుంచి ఆమె చెన్నైలోని హడోవ్స్ రోడ్ వద్ద తమ నివాసంలోనే ఒంటరిగా జీవిస్తున్నారు.
శనివారం వాణీ జయరాం పని మనిషి ఇంటికి రావడంతో ఆమె ఎంత సేపటికీ తలుపులు తీయలేదు. దీంతో వాణీ జయరాం సోదరికి సమాచారమిచ్చారు. వాణీ జయరాం సోదరి, పనిమనిషి ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె బెడ్ రూంలో విగతజీవిగా కనిపించారు. ముఖంపై గాయాలు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.