»113 New Medical Colleges May Get Nmc Approval 22 Will Be From Up 14 From Maharashtra
medical colleges : దేశంలో కొత్తగా 113 వైద్య కళాశాలలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే?
భారత దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు అవుతున్నాయి. మొత్తం 113 కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచే యూజీ కోర్సులను అందించనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ చదివేయండి.
New medical colleges : వైద్య విద్యాభ్యాసానికి కళాశాలల కొరత, ఫీజుల్లాంటివి పెద్ద ప్రతిబంధకంగా ఉన్నాయి. ఈ కళాశాలల లోటును పూరించేందుకు ప్రభుత్వం అడుగులు వేసింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్తగా 113 వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలల్లో ఎంబీబీఎస్ (MBBS) కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అనుమతులు జారీ చేసినట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కింద ఉండే.. మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్(ఎంఏఆర్బీMARB) అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజీలు(medical colleges) పెట్టడానికి 2024 -25 విద్యా సంవత్సరానికి గాను తమకు 170 అప్లికేషన్లు అందినట్లు ఎంఏఆర్బీ తెలిపింది. అందులో మొత్తం 113 కాలేజీలకు కొత్తగా అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించింది. సంబంధిత వివరాలను ఈమెయిల్స్ ద్వారా ఆ కాలేజీలకు తెలియజేసినట్లు చెప్పింది. ఈ కొత్త కాలేజీల రాష్ట్రాల వారీగా ఎన్నెన్ని వచ్చాయనే వివరాలను ప్రకటించింది.
అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌లో 22 కళాశాలలకు కొత్తగా అనుమతులు వచ్చినట్లు ఎంఏఆర్బీ తెలిపింది. మహారాష్ట్రకు 14, రాజస్థాన్‌కు 12, తెలంగాణకు 11, పశ్చిమబెంగాల్‌కు 8, ఆంధ్రప్రదేశ్‌కు 7, మధ్యప్రదేశ్‌కు 7, తమిళనాడుకు 5, కర్ణాటకకు 5, కేరళకు 2 కళాశాలలు చొప్పున వచ్చినట్లు చెప్పింది. అలాగే ఒరిస్సా, గుజరాత్‌లకు రెండేసి చొప్పున, ఉత్తరాఖండ్‌కి 3 వచ్చినట్లు తెలిపింది. త్రిపుర, సిక్కి, పంజాబ్, అస్సాం, హరియాణాలకు తలో మెడికల్ కాలేజీకి అనుమతి ఇచ్చినట్లు ప్రకటించింది.