Shruti Haasan : కమలహాసన్ కుమార్తెగానే కాకుండా, నటిగా తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు శృతిహాసన్. ఏ విషయాన్ని అయినా బోల్డ్‌గా మాట్లాడేస్తారు. తనపై వచ్చే విమర్శలకు సైతం దీటుగా సమాధానం ఇస్తారు. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల తన ఇన్‌స్టా గ్రాం ఖాతా ద్వారా అభిమానులతో చిట్‌ఛాట్ చేశారు. ‘ఆస్క్ మి ఎనీ థింగ్’ పేరుతో ఓ చిట్‌ఛాట్ నిర్వహించారు. అక్కడ అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఓ నెటిజన్ ఈ సందర్భంగా ఓ ప్రశ్న వేశాడు. మీ సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా మాట్లాడండంటూ వ్యంగ్యంగా అడిగాడు. దీంతో శృతి హాసన్(Shruti Haasan) దీనిపై ఘాటుగా స్పందించారు. ఇది బయటకు కనిపించకుండా ప్రదర్శంచే జాతి వివక్ష అంటూ కామెంట్ చేశారు. ఈ వివక్ష అంత మంచిది కాదంటూ సమాధానం చెప్పారు. అలాగే దక్షిణాది వారిని ఇడ్లీ సాంబార్(Idli Sambar) అంటూ చేసే వ్యాఖ్యలు సైతం ఏమాత్రం సమర్థనీయం కాదంటూ పేర్కొన్నారు. మీరు మమ్మల్ని ఎప్పటికీ అనుకరించలేరంటూ చురకలు అంటించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిదంటూ సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.
ఈ కామెంట్లను చూసిన దక్షిణాది నెటిజన్లంతా శృతి(Shruti) స్పందించిన తీరును సమర్థించారు. హర్షం వ్యక్తం చేశారు. బాగా బుద్ధి చెప్పారంటూ కామెంట్లు చేశారు. ఈ మధ్య కాలంలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్లు ప్రి వెడ్డింగ్ వేడుకల్లో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ రామ్ చరణ్‌ని పిలుస్తూ ఇడ్లీ, వడ అంటూ సంభోధించారు. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇది కచ్చితంగా హిందీ తారలకు దక్షిణాది వారిపై ఉన్న చులకన భావాన్ని వెల్లడిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా శృతి వ్యాఖ్యలు సైతం వైరల్(viral) అయ్యాయి.