»Tamil Nadu Illicit Liquor Case Death Toll Reaches 47 3 Accused In Judicial Custody Uproar In The Assembly
Illicit Liquor Case : 47కి చేరిన తమిళనాడు కల్తీ మద్యం మృతుల సంఖ్య.. ముగ్గురు నిందితుల అరెస్ట్
తమిళనాడులో కల్తీ మద్యం తాగి ఇప్పటివరకు 47 మంది చనిపోయారు. ఈ అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై శుక్రవారం అసెంబ్లీలో విపక్షాలు గందరగోళం సృష్టించాయి.
Illicit Liquor Case : తమిళనాడులో కల్తీ మద్యం తాగి ఇప్పటివరకు 47 మంది చనిపోయారు. ఈ అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై శుక్రవారం అసెంబ్లీలో విపక్షాలు గందరగోళం సృష్టించాయి. చాలా మంది ఎమ్మెల్యేలను బలవంతంగా అసెంబ్లీ నుంచి బయటకు పంపించి ఆ తర్వాత వెనక్కి పిలిచారు. జూన్ 29 వరకు ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఈ అంశంపై చర్చ జరగడం ఖాయం. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
శుక్రవారం తమిళనాడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) సభ్యులు కళ్లకురిచిలో కల్తీ మద్యం ఘటనపై లేవనెత్తడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత పలువురు పార్టీ సభ్యులు సభ నుండి బయటకు పంపించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి మేరకు ప్రతిపక్ష సభ్యుల బహిష్కరణ రద్దు చేశారు. అనంతరం తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. పళనిస్వామి మాట్లాడుతూ.. అన్నాడీఎంకే సభ్యులను సభ నుండి బహిష్కరించిన చర్యను “ప్రజాస్వామ్య హత్య”గా ఆయన అభివర్ణించారు. కళ్లకురిచ్చిలో కల్తీ మద్యం తాగి 50 మంది చనిపోయారని పళనిస్వామి పేర్కొన్నారు.
ప్రశ్నోత్తరాల సమయంలో ఏఐఏడీఎంకే సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తాలని కోరారని, ఇది సభా నిబంధనలకు విరుద్ధమని అసెంబ్లీ స్పీకర్ ఎం.అప్పావు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాతే జీరో అవర్‌లో సభ్యులు ఎలాంటి సమస్యనైనా లేవనెత్తవచ్చని చెప్పారు. ఏఐఏడీఎంకే సభ్యులు తమ డిమాండ్‌పై మొండిగా నిలవడంతో స్పీకర్ వారిని సభ నుంచి బయటకు పంపాలని ఆదేశించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు సభాకార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదని తెలిపారు. అనంతరం ప్రధాన ప్రతిపక్షం సభ్యులను సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అనుమతించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని అంగీకరించిన అప్పావు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తిరిగి సభకు రమ్మని కోరారు. పళనిస్వామి సహా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు.
తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో చాలా మంది అక్రమ మద్యం సేవించారు. దీని తరువాత వారి ఆరోగ్యం క్షీణించింది. ఇప్పటి వరకు విష మద్యం తాగి 47 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి 49 ఏళ్ల కె. కన్నుకుట్టి (అక్రమ మద్యం విక్రయదారుడు)ని అరెస్టు చేయగా, అతడి నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు 200 లీటర్ల కల్తీ మద్యంలో ప్రాణాంతకమైన ‘మీథేన్’ ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 9 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి సీఎం ఎంకే స్టాలిన్ రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. అదే సమయంలో మద్యం సేవించి అస్వస్థతకు గురైన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు.