అలనాటి హీరోయిన్, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన భానుప్రియ మెమరీ లాస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. అప్పట్లో చిరంజీవితో సమానంగా డ్యాన్స్ చేయగలిగిన అతి తక్కువ మంది హీరోయిన్లలో భానుప్రియ కూడా ఒకరు. గత కొంతకాలంగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ మధ్య ఆమె సినిమాల్లో నటించడం లేదు. ఈ విషయం గురించే భానుప్రియ పలు కీలక విషయాలు వెల్లడించారు. తన భర్త చనిపోయారని, అప్పటి నుంచి తాను మెమరీ లాస్ తో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.
తనకు డైలాగ్స్ కూడా గుర్తుండటం లేదని, డ్యాన్స్‌కు సంబంధించిన ముద్రలు కూడా మర్చిపోయానని తెలిపారు. అందుకే డ్యాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచనను కూడా విరమించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను మెడిసిన్స్ తీసుకుంటున్నట్లు వివరించారు. తన భర్త చనిపోవడానికి ముందు అనేక రకాలుగా వార్తలు వచ్చాయన్నారు. తన భర్త నుంచి విడిపోయినట్లు వార్తలు రాశారన్నారు. అది పుకారు మాత్రమేనని, తాను తన భర్త ఎంతో సంతోషంగా ఉండేవారని తెలిపారు. ప్రస్తుతం తన కూతురు లండన్‌లో చదువుకుంటోందని, తనకు సినిమాల వైపు వచ్చే ఆలోచన లేదని భానుప్రియ తెలిపారు.