ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ వాణీ జయరాం చెన్నైలోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై పలు అనుమానాలు రేకెత్తడంతో ఆమెను పరీక్షించేందుకు ఆసుపత్రికి తరలించారు. ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ముఖంపై పలు గాయాలు ఉన్నాయి. దీంతో ఆసుపత్రిలో వాణీకి పోస్ట్మార్టం నిర్వహించారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని చెన్నైలోని తన ఇంటికి తరలించారు. అక్కడ అభిమానుల సందర్శనార్థం వాణీ పార్థీవదేహాన్ని కొంత సేపు ఉంచనున్నారు.
వాణీ జయరాం 20 వేల పాటలకు పైగా పాడారు. క్లాసైనా, క్లాసికలైనా, జానపదమైనా, బీట్ సాంగ్ అయినా వాణీ జయరాం గళంలో పడితే ఏ పాటైనా సరే అపురూపమైన ఆణిముత్యంలా జాలువారుతుంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా వాణీ జయరాం సినీ సంగీత ప్రియుల్ని తన గాత్రంతో అలరించింది. ఆమెకు కేంద్ర ప్రభుత్వం కూడా పద్మ భూషణ్ పురస్కారాన్ని అందజేసింది. ప్రస్తుతం ఆమె మరణవార్తతో సినీ ప్రముఖులు, సంగీత ప్రియులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వాణీ జయరాం ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్పురీతో కలిసి మొత్తం 14 భాషల్లో పాటలు పాడారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న జన్మించిన వాణీ జయరాం అసలు పేరు కలైవాణి.