Viral News: తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో పురాతనకాలం నాటి శిల బయటపడింది. జిల్లాలోని దూల్మిట్ట మండలంలోని భైరాన్ పల్లిలో గ్రామస్తులకు ఓ పూరతన శిల దర్శనం ఇచ్చింది. అయితే దూల్మిట్ట గ్రామంలో పురాతన జైన ఆలయం ఉంది. స్థానికంగా ఆ ఆవరణాన్ని అంగడి వీరన్న శివాలయంగా పిలుస్తారు. ఇటీవల వర్షాల కారణంగా ఆ ఆలయం ఆవరణలో చిన్న గుంత ఏర్పడింది. అదేంటని గ్రామస్తులు పరిశీలించగా ఓ రాయి కనిపించింది. దాన్ని గ్రామస్తులు తవ్వి బయటకు తీశారు. అది పూరతనపు శిల అని గుర్తించ వెంటనే పూరావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న అధికారులు దాన్ని పరిశీలించి చాళుక్యుల కాలం నాటి శిల అని వెల్లడించారు.
ఈ విషయంపై అధికారి శ్రీనివాస్ మాట్లాడారు. తాజాగా బయటపడ్డ ఈ శిలను జైన చౌముఖి శిల్పం అని వ్యవహరిస్తారు అని పేర్కొన్నారు. దీన్ని 5 అడుగుల ఎత్తుతో చెక్కారని చెప్పారు. శిలకు నాలుగు వైపుల శిల్పాలు 24వ జైన తీర్థంకరుడు మహా వీరుడి ధ్యానం చేస్తున్న చిత్రాలు చెక్కినట్లు వివరించారు. ఇలాంటి శిల్పాలను గతంలో కొలనుపాక, వేములవాడలో గుర్తించామని తెలిపారు. జైనులు వీటిని ‘సర్వతోభద్ర’ అంటూ పిలుస్తారని చెప్పారు. ఈ శిల్పాలు లభించిన ప్రాంతాలు పూర్వం జైనధర్మ కేంద్రాలుగా విరాజిల్లాయని వెల్లడించారు. బౌద్ధుల మాదిరిగానే జైనులు కూడా స్తూపాలు, చైత్యాలు నిర్మించుకునేవారని తాజాగా ఈ గ్రామంలో లభించిన శిల ఆధారంగా తెలుస్తోందని శ్రీనివాస్ చెప్పారు.