టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్, సీనియర్ దర్శకుడు సాగర్ మరణాలను మరిచిపోక ముందే ప్రముఖ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. అంతలోనే శనివారం టాలీవుడ్ నిర్మాత ఆర్వీ గురుపాదం కూడా తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు.
తెలుగులో ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’, ‘పులి బెబ్బులి’ సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. అలాగే తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళం భాషల్లో 25 సినిమాలను రూపొందించారు. బాలీవుడ్లో శ్రీదేవి హీరోయిన్గా ‘అకల్ మండ్’ సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా పలు తమిళ, మలయాళ సినిమాలను తెలుగులోకి అనువదించారు. నిర్మాత ఆర్వీ గురుపాదం మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మరోవైపు సింగర్ వాణీ జయరాం చెన్నైలోని ఆమె నివాసంలో శనివారం మరణించారు. టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటూ ఉండటంతో సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.