AP : 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కూటమి.. కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్న వైసీపీ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారు సహా వైసీపీ అభ్యర్థులు చాలా మందికి ఆధిక్యం లేకపోవడంతో వారంతా కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకి తరలి వెళ్లిపోయే ఘటనలు కనిపిస్తున్నాయి.
AP ELECTION RESULTS 2024 : ఆంధ్రప్రదేశ్(AP) ఎన్నికల లెక్కింపులో ఉదయం పదకొండు గంటల సమయానికి కూటమి అభ్యర్థులు చాలా చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దూసుకు వెళుతోంది. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్‌ను కూడా దాటేసింది. దీంతో పలువురు వైసీపీ అభ్యర్థులు(ycp candidates) ఓటమిని ముందుగానే అంచనా వేస్తున్నారు. దీంతో వారు కౌంటింగ్ కేంద్రాల నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 స్థానాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం పదకొండు గంటల సమయానికి 150కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కేవలం 18 స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. దీంతో వైసీపీ అభ్యర్థుల్లో ఓటమి భయం చోటు చేసుకుంది. ఇప్పటికే ప్రస్తుతం మంత్రులుగా ఉన్న బొత్స సత్య నారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్ర నాథ్, అంజాద్ బాషా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఉష శ్రీచరణ్, గుడివాడ అమర్నాథ్, కొట్టు సత్యనారాయణ, రాజన్న దొర, దాడి శెట్టి రాజా, అంబటి రాంబాబు, కాకాణి కోవర్ధన్ రెడ్డి, రజిని, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ తదితరులు ఓటమికి దగ్గర్లో ఉన్నారు.
కూటమి ఆధిక్యం కొనసాగుతుండటంతో వైకాపా అభ్యర్థులు(ycp candidates) ఒక్కొక్కరుగా కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నారు. మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీలోని కౌంటింగ్ కేంద్రం నుంచి పామర్రు వైసీపీ అభ్యర్థి కైలే అనిల్ బయటకు వెళ్లిపోయారు. అలాగే గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ సైతం కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు.