»Assembly Bypolls Results 2024 Live India Bloc Clear Leading In Bypolls
BYPOLLS RESULTS : ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి పార్టీలదే హవా
దేశ వ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల కోసం నేడు కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 13 స్థానాల్లో ఉప ఎన్నిక జరగ్గా దాదాపుగా పది స్థానాల్లో ఇండియా కూటమి పార్టీల అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. పూర్తి ఫలితాలు ఈ సాయంత్రానికి తెలుస్తాయి.
BYPOLLS RESULTS 2024 : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ నియోజవర్గాలకు జులై పదిన ఉప ఎన్నికలు(BYPOLLS) జరిగిన సంగతి తెలిసిందే. వీటి ఫలితాల కోసం శనివారం కౌంటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి 13 స్థానాలకు గాను, పది స్థానాల్లో ఇండియా కూటమిలో ఉన్న పార్టీల అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ సాయంత్రానికి ఈ ఫలితాలపై(RESULTS) పూర్తి స్పష్టత వస్తుంది.
లోక్ సభ ఎన్నికల తర్వాత మళ్లీ ఈ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనే ఎన్డీయే, ఇండియా కూటముల్లో ఉన్న పార్టీలు తలపడ్డాయి. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికల్లో మాత్రం ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అత్యధిక స్థానాల్లో ఇండియా కూటమిలోనే పార్టీలే విజయం దిశగా పయనిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలు దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు రాష్ట్రాల్లో, 13 నియోజకవర్గాలకు జరిగాయి. పశ్చిమ బెంగాల్లో నాలుగు, ఉత్తరాఖండ్‌లో రెండు, హిమాచల్ ప్రదేశ్‌లో 3, తమిళనాడు, బీహార్, పంజాబ్, మధ్య ప్రదేశ్‌ల్లో ఒక్కో స్థానానికి జరిగాయి.
ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందు పరిచిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ఫలితాలు ఇలా ఉన్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో మూడు సీట్లను తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. మరో సీటులోనూ ఆధిక్యంలో ఉంది. అలాగే ఉత్తరాఖండ్‌లో ఉప ఎన్నిక జరిగిన రెండు సీట్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో నిలిచింది. తమిళనాడులో డీఎంకే ఆధిక్యంలో ఉంది. పంజాబ్‌లోని ఒక సీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది.హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ జరిగిన మూడు సీట్లలో రెండింటిలో కాంగ్రెస్ గెలిచింది. ఒక సీట్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఒక స్థానంలో మాత్రం బీజేపీ ఆధిక్యంలో ఉంది. బీహార్‌లో స్వతంత్ర అభ్యర్థి లీడింగ్‌లో ఉన్నారు.