మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ ఫ్యామిలీకి తానే వీర విధేయుడినని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని.. జగన్ నీటి బొట్టు అని ఓదార్పు యాత్ర సమయంలో అనలేదా అని ప్రశ్నించారు. కాకాణి సొంత గ్రామంలో వైఎస్ విగ్రహాం ఏర్పాటు చేసే సమయంలో అడ్డుకోలేదా అని నిలదీశారు. తనకు కాకాణితో బంధం, బంధుత్వం, అనుబంధం, స్నేహం ఉందన్నారు. కాకాణి బావా అని మీడియా సమావేశంలో పలుమార్లు ఉచ్చరించారు. ‘నీ కన్నా ఎక్కువే మాట్లాడగలను. చమత్కారంగా మాట్లాడి, ఛలోక్తులు విసరగలాను. తాను పార్టీ నుంచి సైలంట్‌గా వెళ్లాలి’ అనుకున్నానని శ్రీధర్ రెడ్డి తెలిపారు.
జగన్‌కు విధేయుడినేనని.. తొలి నుంచి ఉన్నానని శ్రీధర్ రెడ్డి తెలిపారు. జగన్ వద్ద ఉండి, చంద్రబాబు కాళ్లకు దండాలు పెట్టలేదన్నారు. అలా దండం పెట్టింది నువ్వు కాదా అని కాకాణిని అడిగారు. కాకాణికి మంత్రి పదవీ వచ్చిందని.. అందుకే మిమ్మల్ని తిడతారు, ఏదో ఫ్రెండ్ షిప్ వాళ్ల అలా అంటారని మిత్రులు చెప్పారని కోటంరెడ్డి చెప్పారు. నిజాలు చెప్పాలి అని.. ఆ మరునాడు మీడియా ముందుకు నిజం చెప్పేందుకు వస్తానని పేర్కొన్నారు. తన విషయం కాకుండా కాకాణి నెల్లూరు కోర్టులో దొంగతనం గురించి పట్టించుకుంటే బాగుంటుందని హితవు పలికారు. అన్ని కాగితాల్లో కాకాణికి సంబంధించిన పేపర్ ఎలా మిస్ అవుతుందని అడిగారు. సీబీఐ బృందాలు కూడా తిరుగుతున్నాయని చెప్పారు. ఆ పేపర్ మాయం చేసింది నువ్వు కాదు.. అన్నీ వేళ్లు నీ వైపు చూపిస్తున్నాయని చెప్పారు. తన బావా కాకాణి బాగుండాలని ఈ విషయం చెబుతున్నానని తెలిపారు.
జగన్ విషయంలో మీడియా ముందుకు వచ్చినా కాకాణి గోవర్ధన్ రెడ్డి రియాక్ట్ కాలేదని కోటంరెడ్డి తెలిపారు. సజ్జల పేరు తీయగానే ఎగిరి గంతేశారని చెప్పారు. ఇదే విషయం మిత్రుడిని అడిగితే.. కాకాణికి మంత్రి పదవీ ఇచ్చింది జగన్ అయినా ఇప్పించింది సజ్జల అని చెప్పారు. ఓహో అలాగా అని తనకు అప్పుడు అర్థమయ్యిందన్నారు. మంత్రి పదవీ ఇప్పించిన వారిపై విశ్వాసం చూపించాలి.. అందుకే స్పందించారని అనుకున్నానని తెలిపారు. ఏం జరిగిందో మాత్రం ప్రజలకు వాస్తవం తెలియజేస్తున్నానని చెప్పారు.
నెల్లూరు గ్రామ జాతరను స్థానిక శాసనసభ్యుడిగా తానే ఘనంగా నిర్వహిస్తానని చెప్పారు. తనకు వస్తోన్న బెదిరింపులతో సెక్యూరిటీ అవసరం లేదని.. అభిమానులే రక్షగా ఉంటారని కోటంరెడ్డి చెప్పారు. మాట్లాడేందుకు వెళ్తే కేసు పెట్టించారని ఆరోపించారు. తనను బెదిరించిన ఆడియో ఆధారంగా సుమోటోగా కేసు పెట్టొచ్చని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై లాయర్లతో చర్చిస్తున్నామని వివరించారు. తన వద్ద 16 సెకన్ల ఆడియో మాత్రమే ఉందన్నారు. వారి వద్ద 50 సెకన్ల ఆడియో ఉందట.. బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విపక్ష టీడీపీకి చెందిన నరేంద్ర, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడుని జగన్ సర్కార్ పెట్టిన ఇబ్బంది చూశామని అన్నారు. సొంత పార్టీ నేత రఘురామకృష్ణ రాజును కూడా వదల్లేదన్నారు.