ఈ నెల 5వ తేది నుంచి తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవను నిర్వహిస్తూ వస్తున్నారు. ఫిబ్రవరి 5న రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ గరుడ సేవ వేడుకగా సాగనుంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే ఆ రోజే తిరుమలలో రామకృష్ణ తీర్థ ముక్కోటిని నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటిని ప్రతి సంవత్సరం మాఘమాసం రోజున నిర్వహిస్తారు. ఆలయానికి ఆరుమైళ్ల దూరంలో ఉన్న ఈ తీర్థానికి పౌర్ణమి రోజున ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. పున్నమి రోజున ఉదయం 7 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామాగ్రితో తీర్థం వద్దకు వెళ్లి రామకృష్ణ తీర్థంలో వెలిసిన రామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.