నటీనటులు: సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్, అయ్యప్ప శర్మ దర్శకుడు: రంజిత్ జయకోడి నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు విడుదల తేదీ : ఫిబ్రవరి 3, 2023
గత ఏడాది విడుదలైన ఏ1 ఎక్స్ ప్రెస్, వివాహ బోజనంబు, గల్లీ రౌడీ వంటి చిత్రాలతో నిరాశ చెందిన హీరో సందీప్ కిషన్ మైఖేల్ మూవీతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు సందీప్ కిషన్ యాక్ట్ చేసిన ఫస్ట్ పాన్ ఇండియా చిత్రంతోనే మంచి టాక్ దక్కించుకున్నాడని చెప్పవచ్చు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో సందీప్ కిషన్ యాక్టింగ్ సూపర్ అంటూ కామెంట్లు చేశారు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదలైంది.
కథ
మైఖేల్(సందీప్ కిషన్) ఈ చిత్రంలో ఒక అనాథగా కనిపిస్తాడు. తన తల్లికి జరిగిన అన్యాయంపై పగ తీర్చుకునేందుకు తండ్రినే చంపాలని భావిస్తాడు. ఆ క్రమంలో ముంబైలో ఒక భయంకరమైన గ్యాంగ్‌స్టర్ అయిన గురునాథ్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) దగ్గరకు మైఖేల్ చేరతాడు. మరోవైపు గురునాథ్ తన భార్య చారులత(అనసూయ) చెప్పిన ప్రకారమే నడుచుకుంటాడు. వీరి కుమారుడైన అమర్ నాథ్ (వరుణ్ సందేశ్) మాత్రం తండ్రిని చంపేసి నేర సామ్రాజ్యానికి తానే అధిపతి కావాలని ప్లాన్స్ వేస్తుంటాడు. ఆ క్రమంలో గురు నాథ్ మీద జరిగిన హత్యా ప్రయత్నాన్ని మైఖేల్ అడ్డుకుని గురు నాథ్ ను కాపాడతాడు. దీంతో గురునాథ్ మైఖేల్ ను పూర్తిగా నమ్మేసి..తన కుమారుడికి దక్కాల్సిన వారసత్వం మైఖేల్ కు అప్పగిస్తాడు. ఈ నేపథ్యంలో తనపై అటాక్ చేసిన వారిలో రథన్(అనీష్ కురువిల్లా), అతని కుమార్తె తీరా(దివ్యాంశ కౌశిక్) ఉన్నారని గురునాథ్ తెలుసుకుని వారిని చంపాలని మైఖేల్ కు పనిని అప్పగిస్తాడు. ఆ క్రమంలో ఢిల్లీ వెళ్లిన హీరో…హీరోయిన్ తీరాను కలిసి లవ్ ట్రాక్ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు గురునాథ్ చెప్పిన పనిని మైఖేల్ పూర్తి చేశాడా? ఈ కథలో విజయ్ సేతుపతి, వరలక్ష్మి క్యారెక్టర్లు ఎంటీ? అనేది తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఈ మూవీలో హీరో గురించి 1980 నుంచి 90ల మధ్య కాలంలో జరిగిన సంఘటనలతో ప్రారంభమవుతుంది. ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్, సంగీతం, కథాంశం చూస్తే దాదాపు “కెజిఎఫ్, “విక్రమ్” చిత్రాలు గుర్తుకు వస్తాయి. అంతేకాదు ఈ చిత్రం కూడా విక్రమ్ మాదిరిగా ఎక్కువగా డార్క్ మోడ్ లో చిత్రీకరించారు. మరోవైపు మథర్ సెంటిమెంట్, అనాథ వంటి జోనర్లో ఇప్పటికే అనేక చిత్రాలు వచ్చాయి. కొత్తదనం లేకున్నా కూడా క్యారెక్టరైజేషన్స్ ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. కొన్ని చోట్ల హీరోను ఎలివేట్ చేసే సీన్స్, నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. ఇంకోవైపు విజయ్ సేతుపతి, వరలక్ష్మి పాత్రలను సరిగ్గా వాడుకులేదనిపిస్తుంది. మరోవైపు స్టోరీ కొత్తది కాకున్నా కూడా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లేవల్లో నిర్మించడం సాహాసమేనని చెప్పవచ్చు.
ఎవరెలా చేశారంటే
ఇక మొదట హీరో సందీప్ కిషన్ యాక్టింగ్ విషయానికి వస్తే తన పాత్రలో పూర్తిగా లీనమయ్యాడని చెప్పవచ్చు. ఈ చిత్రంతో సందీప్ తన ఫార్మెమెన్స్ మరింత పెంచుకున్నాడని పలువురు ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. యాక్షన్ సీన్లలో హీరో హార్డ్ వర్క్ కనిపిస్తుంది. మరోవైపు హీరోయిన్ దివ్యాంశ కూడా ఇటు గ్లామర్ తోపాటు అభినయంతో ఆకట్టుకుంది. ఇక గురుగా గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్, అనసూయ, విజయ్ సేతుపతి, వరలక్ష్మి, అయ్యప్ప శర్మ సహా తదితరులు వారి క్యారెక్టర్ల మేరకు న్యాయం చేశారు.
సాంకేతికం
కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ విషయంలో మొదటి చిత్రంతోనే పూర్తిగా సక్సెస్ సాధించాడని చెప్పవచ్చు. ఇక శామ్ సిఎస్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. మరోవైపు నిర్మాణ విలువల విషయంలో నిర్మాతలు ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టినట్లు కనిపిస్తుంది. రచయిత,దర్శకుడు రంజిత్ జెయకోడి విషయానికి వస్తే మైఖేల్‌తో అనుకున్న రీతిలో ఆకట్టుకోలేకపోయాడనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే భిన్నంగా లేకపోవడం, కొన్ని క్యారెక్టర్లు బలహీనంగా రాసుకోవడంతోపాటు సినిమాలో కొత్తదనం కనిపించదు.
ప్లస్ పాయింట్స్
నిర్మాణ విలువలు
సందీప్ కిషన్ యాక్టింగ్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
యాక్షన్ సీన్స్