Ooru Peru Bhairavakona: సందీప్ కిషన్ హిట్ కొట్టినట్టేనా?
చాలా కాలంగా సరైన హిట్ లేకుండా సతమతమవుతున్న సందీప్ కిషన్.. తాజాగా వచ్చిన ఊరు పేరు భైరవకోన సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి సందీప్‌ను ఈ సినిమా అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కించిందా? లేదా?
Ooru Peru Bhairavakona: యంగ్ హీరో సందీప్ కిషన్ కటౌట్‌కి మంచి కథలు పడితే.. అదిరిపోతుంది. కానీ కమర్షియల్‌గా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ట్రై చేస్తుంటాడు సందీప్. అందుకే.. సినిమా రిజల్ట్స్ తేడా కొట్టేస్తున్నాయి. సందీప్‌కు మంచి హిట్ పడి చాలా కాలమే అవుతోంది. ఆ మధ్య మైఖేల్ అంటూ పాన్ ఇండియా లెవల్లో భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో లేటెస్ట్ ఫిల్మ్ ఊరు పేరు భైరవకోన పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. సందీప్‌కు తగ్గట్టే వైవిధ్యమై సినిమాలు చేసే డైరెక్టర్ విఐ ఆనంద్‌తో కలిసి ఈ సినిమా చేశాడు.
కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను కాస్త గట్టిగా ప్రమోట్ చేశాడు సందీప్. ముందు నుంచే ఈ సినిమా కంటెంట్ ఆడియెన్స్‌కు మంచి ఇంట్రెస్ట్ కలిగించింది. గరుడ పురాణంలో మిస్సయిన నాలుగు పేజీలే ఈ భైరవకోన.. అని చెబుతూ ఉండడంతో సినిమా మీద ఉన్న ఆసక్తి అంతకంతకు పెరుగుతూ వెళ్లింది. ఫైనల్‌గా ఈ సినిమా ఫిబ్రవరి 16న థియేటర్లోకి వచ్చేసింది. అంచనాలకు తగ్గట్టే.. ఓ రోజు ముందే ప్రీమియర్స్ వేయగా.. మంచి టాక్ సొంతం చేసుకుంది ఊరు పేరు భైరవకోన.
ఇక థియేటర్లోకి వచ్చాక మొదటి షోతోనే పాజిటివ్ రివ్యూస్ అండ్ టాక్ అందుకుంది. సూపర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా ఈ సినిమా అలరిస్తుందని అంటున్నారు. సందీప్ కిషన్, వర్ష మధ్య కెమిస్ట్రీ, డైలాగ్స్, కామెడీ ట్రాక్, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ముఖ్యంగా కథకు తగ్గట్టుగా ఉన్న గ్రాఫిక్స్ బాగుందని అంటున్నారు. దీంతో.. ఈ సినిమాతో సందీప్ హిట్ కొట్టినట్టేనని అంటున్నారు. మరి ఊరు పేరు భైరవ కోన కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.