పాల వినియోగదారులకు అమూల్ సంస్థ మరోసారి షాకిచ్చింది. కొన్నాళ్లుగా పాల ధరను పెంచుతున్న అమూల్ తాజాగా మరోసారి పెంచేసింది. అన్ని రకాల పాలపై ధరలు పెంచుతున్నట్లు అమూల్ బ్రాండ్ సంస్థ ‘గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ప్రకటించింది. గుజరాత్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాల ధరలు పెరుగుతాయని గురువారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. లీటర్ పాలపై రూ.3 వరకు పెంచినట్లు అమూల్ సంస్థ ఎండీ జయేన్ మెహతా తెలిపారు.
ఈ పెరిగిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. పాల ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరిగిన కారణంగా ధరలను పెంచాల్సి వస్తోందని సంస్థ వివరణ ఇచ్చింది. ఒక్క పశువుల దాణా ధరలే 20 శాతం వరకు పెరిగినట్లు ప్రకటనలో తెలిపింది. గత ఏడాది 2022లో అమూల్ పాల ధరలను మూడసార్లు పెంచింది. ఆగస్టు, అక్టోబర్ లో లీటర్ పాలపై రూ.2 చొప్పున ధర పెంచిన విషయం తెలిసిందే. పాల ధరలు పెరుగుతుండడంపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.