అదానీ గ్రూప్ పై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక వ్యవహారం పార్లమెంట్ ను వీడడం లేదు. ఆ వ్యవహారంపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు రెండు రోజు కూడా ఆందోళన చేశాయి. అదానీ గ్రూపుపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై సభలో చర్చించాల్సిందేనంటూ విపక్షాలు పట్టుబట్టాయి. వీరి ఆందోళనతో ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాలని విపక్ష పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల రీత్యా ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లేదా సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాాప్తు చేయించాలని డిమాండ్ చేశాయి. అయితే వీరి అభ్యర్థలను లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తోసిపుచ్చారు. సభ్యులు నిరాధారమైన ఆరోపణలు చేయకూడదని హితవు పలికారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను చైర్మన్ పట్టించుకోలేదు. తీర్మాణం స్వీకరించాలని ప్రతిపక్ష నేతలు నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో రెండు సభలు వాయిదా పడ్డాయి. కాగా అంతకుముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో విపక్ష పార్టీలన్నీ సమావేశమయ్యాయి. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్ష పార్టీల సభ్యులు చర్చించారు.