హైదరాబాద్ లో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. రేపటి నుంచి తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. శాసన సభ, శాసన మండలిని ఉద్దేశించి రేపు మధ్యాహ్నం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. గతంలో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు.
రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్, బషీర్ బాగ్, రవీంద్ర భారతి, మాసాబ్ ట్యాంక్, లక్డీకపూల్, నాంపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరగనున్నాయి. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రాఫిక్ మళ్లింపుతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.