Fruits : రాత్రి పూట ఈ పండ్ల జోలికి అస్సలు పోవద్దు!
మామూలు సమయాల్లో పండ్లు తినడం మన ఆరోగ్యానికి మంచిదే కాని.. రాత్రి పూట మాత్రం కొన్ని పండ్లను తినొద్దంటున్నారు నిపుణులు. అందువల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయంటున్నారు. అవేంటంటే..
Fruits To Avoid At Night : మనం ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల ఆహారం తీసుకుంటాం. అందులో భాగంగా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను రోజు వారీ ఆహారంలో చేర్చుకుంటాం. అయితే మిగిలిన సమయాల సంగతి అటుంచితే రాత్రిళ్లు మాత్రం కొన్ని పండ్లు(FRUITS) తినకుండా ఉండటమే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుని రాత్రిళ్లు( NIGHTS) తినకుండా ఉండే ప్రయత్నం చేద్దాం.
పైనాపిల్, నిమ్మ జాతి పండ్లను రాత్రి భోజనం తర్వాత తీసుకోకుండా ఉంటే మంచిది. వీటిల్లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆమ్లాల కారణంగా రాత్రి కడుపు ఉబ్బరంగా అనిపించడం, గుండెల్లో మంట, అనీజీగా ఉండటం, సరిగ్గా నిద్రపట్టకపోవడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే పుచ్చకాయను కూడా తినకుండా ఉండటం మంచిది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రిళ్లు మాటిమాటికీ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది. అందువల్ల నిద్ర సరిగ్గా పట్టదు.
వేసవి కాలంలో దొరికే తియ్యటి మామిడి పండ్లను చాలా మంది రాత్రిళ్లు కూడా తింటూ ఉంటారు. వీటిలో సాధారణంగా చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. కాబట్టి మన శరీరంలో రాత్రి పూట ఎక్కువగా చక్కెరలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే ఇలా గ్లూకోజ్ ఎక్కువగా ఉండే అరటి పండ్లు, ద్రాక్ష, చెర్రీలు, ఖర్జూరం లాంటి వాటిని రాత్రిళ్లు తినకుండా ఉండటం ఉత్తమం. ఇంకా బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీన్ని రాత్రి పూట తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, గుండెల్లో మంట లాంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది.