మనం ఏదైనా కారును కొనుగోలు చేస్తే స్పాట్ పేమెంట్ అయితే వెంటనే డబ్బులు ఇస్తాం. ఈఎంఐలో తీసుకుంటే మూడేళ్లు, ఆలస్యమైతే మహా అయితే నాలుగైదేళ్లు అవుతుందేమో. కానీ ఓ దేశం మాత్రం మరో దేశం నుండి అధిక సంఖ్యలో కార్లను కొనుగోలు చేసి, దాదాపు 50 సంవత్సరాలు కావొస్తున్నా ఆ మొత్తాన్ని చెల్లించలేదట. 1974లో ఉత్తర కొరియా 1000 వోల్వో 144 మోడల్ కార్లను ఆర్డర్ చేసింది. స్వీడన్ వాటిని వెంటనే డెలివరీ చేసింది. కానీ ఈ కార్ల మొత్తాన్ని నార్త్ కొరియా ఇప్పటి వరకు చెల్లించలేదు. కార్ల వ్యాల్యూ, వడ్డీని కలిపి స్వీడన్‌కు నార్త్ కొరియా 300 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించాలి. ఇది మన భారత కరెన్సీలో రూ.22,000 కోట్లకు పైగా ఉంటుంది. నార్త్ కొరియా ఫారెన్ డెబిట్ అంతకు ఐదు రెట్లు ఉండటం గమనార్హం. ఉత్తర కొరియా తమకు ఈ మొత్తాన్ని చెల్లించడానికి స్వీడన్ మరెన్ని దశాబ్దాలు వేచి చూస్తుందో. మొత్తానికి ఇది ప్రపంచ అతిపెద్ద కారు మోసం లేదా కారు దొంగతనంగా చెప్పవచ్చు. ఉత్తర కొరియా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఐదు దశాబ్దాలుగా ఆర్థిక పరిస్థితి బక్క చిక్కుతోంది. తలసరి ఆదాయం తగ్గుతోంది. అయితే ఈ రెండు దేశాల మధ్య 1973 నుండి మంచి సంబంధాలు ఉన్నాయి. ఉత్తర కొరియాకు మానవతా సాయం అందించడంలో స్వీడన్ ముందు ఉంటూ వస్తోంది.