»Rbi To Launch A Mobile App For Investing In Government Securities
RBI : ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులకూ ఓ యాప్
రిటైల్ ఇన్వెస్టర్లు ప్రభుత్వ సెక్యూరిటీల్లో తేలిగ్గా పెట్టుబడులు పెట్టేందుకు రిటైల్ డైరెక్ట్ స్కీం పరిధిలో ఓ యాప్ ని తీసుకువస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
RBI : ఇన్వెస్టర్లు ఇక నుంచి ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం మరింత తేలిక కానుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఓ మొబైల్ యాప్‌ను ఆర్బీఐ త్వరలో అందుబాటులోకి తేనుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్(RBI Governor) శక్తికాంత దాస్ చెప్పారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు మరింత సులభతరం చేయడానికే తాము రిటైల్ డైరెక్ట్ పోర్టల్ అనుబంధ మొబైల్ అప్లికేషన్‌ను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఆ యాప్ పేరు G-sec App.
త్వరలోనే ఈ యాప్ అందుబాటులోకి వస్తుందని శక్తికాంత్‌దాస్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి రూ.14.13 లక్షల కోట్ల నిధులు సేకరించాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తొలి అర్ధ భాగంలో రూ.7.5 లక్షల కోట్ల నిధులు సేకరించనుందని తెలిపారు. 2021 నవంబర్‌లో ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం ఆర్బీఐ.. ‘రిటైల్ డైరెక్ట్’(Retail Direct) స్కీమ్ తెచ్చింది. ఆర్బీఐ డైరెక్ట్ పోర్టల్ ద్వారా ఇన్వెస్టర్లు ప్రైమరీ, సెకండరీ మార్కెట్ ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. వేలంలో ఇన్వెస్టర్లు ఈ ప్రభుత్వ సెక్యూరిటీల క్రయ, విక్రయాలు కూడా చేయొచ్చు.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) వాడకం మరింత పెంచడానికి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్ల నుంచీ డిజిటల్ కరెన్సీ వాలెట్ అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం రిటైల్, హోల్ సేల్ క్యాటగిరీల్లో మాత్రమే ‘సీబీడీసీ’ వాలెట్ సేవలను బ్యాంకులు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాయి. రిటైల్ అవసరాలకు సీబీడీసీ వినియోగాన్ని మరింత పెంచేందుకు నాన్ బ్యాంకింగ్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు కూడా సీబీడీసీ వాలెట్లు అందిస్తారని, అందుకు అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు శక్తికాంత దాస్(Shaktikanta Das) చెప్పారు.