»Pakistan Venomous Letters Threatening Judges Of Pakistan
Pakistan: పాకిస్థాన్ ఉన్నత న్యాయమూర్తులకు భయపెట్టిస్తున్న విషపు లేఖలు
పాకిస్థాన్లో ఉన్నత న్యాయస్ధానాలకు వచ్చిన అనుమానాస్పద లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇస్లామాబాద్, లాహోర్ హైకోర్టు న్యాయమూర్తులకు పదుల సంఖ్యలో ఇలాంటి లేఖలు వచ్చాయి.
Pakistan: పాకిస్థాన్లో ఉన్నత న్యాయస్ధానాలకు వచ్చిన అనుమానాస్పద లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇస్లామాబాద్, లాహోర్ హైకోర్టు న్యాయమూర్తులకు పదుల సంఖ్యలో ఇలాంటి లేఖలు వచ్చాయి. వాటిలో తెల్లటి పౌడర్ ఉండటం ఇంకా భయాందోళనలు రేపింది. న్యాయమూర్తులను బెదిరించడమే లక్ష్యంగా అవి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థలు వెంటనే రంగంలోకి దిగి నిమగ్నమయ్యాయి. మొదట ఆంత్రాక్స్ కారక పదార్థంగా భావించినప్పటికీ పరీక్షల తర్వాత అది ఆర్సెనిక్ కలిగిన పదార్థంగా నిర్ధారించారు.
ఇది స్వచ్ఛమన రూపంలో లేదని తెలిపారు. రావల్పిండిలోని జనరల్ పోస్టాఫీసు నుంచి ఈ లేఖలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అయితే అక్కడ సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను కనుక్కోవడం కష్టంగా మారింది. కవర్లపై ఉన్న వేలిముద్రల ద్వారా వాళ్ల జాడను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. తమకు అనుకూలంగా తీర్పు పొందేందుకు గూఢచార సంస్థల సిబ్బంది కొందరు తమను వేధిస్తున్నారంటూ ఇటీవల ఆరుగురు ఇస్లామాబాద్ న్యాయమూర్తులు ఆరోపించడం సంచలనం రేపింది.
ఇందులోభాగంగా తమ నివాసాలపై నిఘా పెట్టడం, బంధువులను అపహరించి, చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు వారు ఆరోపించారు. ఇప్పటివరకు పాక్ ఉన్నత న్యాయస్థాలకు చెందిన మొత్తం 17 మంది న్యాయమూర్తులకు ఇటువంటి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఇలా జడ్జీలను భయభ్రాంతులకు గురిచేస్తోన్న ఈ వ్యవహారాన్ని అక్కడి సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.