మనం కొన్ని సార్లు రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లాంటి చోట్ల ఫోన్లను ఛార్జింగ్ పెడుతుంటాం. ఇది చాలా ప్రమాదకరమని తాజాగా కేంద్రం హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Public USB Phone Charging problems : మనం కొన్ని సార్లు దూర ప్రాంతాలకు ప్రయాణిస్తుంటాం. అప్పుడు ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ప్లేసుల్లో ఉండే ఛార్జింగ్ స్టేషన్ల దగ్గర సెల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఇది చాలా ప్రమాదకరమని కేంద్రం హెచ్చరిస్తోంది. ఇప్పుడు ఇలాంటి చోట్ల యూఎస్బీ ఛార్జింగ్ స్కాం ఆందోళన కలిగిస్తోందని వెల్లడించింది. తాజాగా ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని అంటోంది. అసలు ఈ స్కాంకి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ( CERT-in) ఈ మార్చిలో ఓ భద్రతా హెచ్చరికను జారీ చేసింది. యూఎస్బీ ఛార్జర్ స్కామ్‌ల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని కోరింది. అసలు ఈ స్కాంలు ఎలా జరుగుతున్నాయంటే?.. హ్యాకర్లకు ఇప్పుడు పబ్లిక్ ఛార్జర్లను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. వాటిని మాల్వేర్తో ప్లగాన్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఎవరైతే ఛార్జింగ్(CHARGING) పెట్టుకుంటారో వారి ఫోన్లో ఉన్న వివరాలు అన్నింటినీ సైబర్ నేరగాళ్లు దొంగలించే అవకాశం ఉంటుంది. ఇలా పబ్లిక్ ఛార్జర్లను లక్ష్యంగా చేయడాన్నే జ్యూస్ జాకింగ్ అని పిలుస్తారు.
ఇలా జ్యూస్ జాకింగ్ చేసే వారికి ప్రస్తుతం పబ్లిక్ ఛార్జర్లు స్వర్గధామంగా మారాయి. తేలిగ్గా అందరి డేటాను హ్యాక్ చేయడానకి వీలు కలుగుతోంది. ఒక వేళ వీటి ద్వారా వారు మీ డాటాను యాక్సస్ చేయగలిగితే ప్రమాదకరమైన యాప్‌లను మీ ఫోన్లలో ఇన్స్టాల్ చేయవచ్చు. మీ వ్యక్తిగత డాటాను దొంగలించవచ్చు అని CERT-IN హెచ్చరించింది. పబ్లిక్ ప్రాంతాల్లో ఛార్జ్ చేయకుండా ఎప్పుడూ కూడా సొంతంగా పవర్ బ్యాంక్‌ని వాడుకోవడం ఉత్తమమని సూచించింది. తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఛార్జ్ చేయాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టమని సలహా ఇస్తోంది.