ఆత్మనిర్భర్ భారత్తో చేనేతలకు మేలు జరిగిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. 9 ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్దే లక్ష్యంగా బడ్జెట్ ఉందన్నారు. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని అభివర్ణించారు. ప్రపంచంలో అతిపెద్ద ఐదో ఆర్థిక వ్యవస్థ భారత్ అని వివరించారు. ఐదోసారి పూర్తి స్థాయి బడ్జెట్ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. 102 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందజేశామని వివరించారు. యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్దంగా ఉందన్నారు. జీ20 సమావేశాలు దేశానికి లభించిన మంచి అవకాశం అని వివరించారు. వసుధైక కుటుంబం సిద్దాంతానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. డిజిటల్ ఇండియాకు ఊతం ఇచ్చేలా ఆధార్, కొవిన్ యాప్ అని పేర్కొన్నారు. ఆర్థిక ప్రగతి 7 శాతం ఉండనుందని అంచనా వేశారు. దేశ అభివృద్దిని ప్రపంచం ప్రశంసిస్తోందని అన్నారు. యూపీఐ ద్వారా అధిక చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు. ఈపీఎఫ్వో సభ్యుల సంఖ్య రెట్టింపు అయ్యిందన్నారు.ఏడు అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చామని వివరించారు. 7 అంశాల ప్రాతిపదికన ఈ బడ్జెట్ రూపొందించినట్టు వెల్లడించారు. సమ్మిళిత వృద్ధి, దేశంలో చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు, మౌలిక సదుపాయాలు-పెట్టుబడులు, యువశక్తి, ఆర్థిక రంగ బలోపేతం, గ్రీన్ ఎనర్జీ, రైతులు-మహిళలు-వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
గిరిజిన వ్యవహారాల కోసం మాజీ ప్రధాని వాజ్ పేయి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందన్నారు. తమ ప్రభుత్వం ఆయుష్, జలశక్తి, కో ఆపరేషన్ తదితర మంత్రిత్వ శాఖలను నెలకొల్పిందన్నారు. విద్యార్థుల కోసం డిజిటల్ లైబ్రరీలను తీర్చిదిద్దామని తెలిపారు. పంచాయతీ స్థాయిలో డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రైవేట్ ప్రభుత్వ పరిశోధనల కోసం ఐసీఎంఆర్ ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు. సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా చేయూత ఇస్తున్నామని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశామని, ఇకపైనా ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. డిజిటల్ చెల్లింపుల విషయంలో చక్కటి అభివృద్ధి సాధించామని అన్నారు. 2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ సరైన పంథాలో పయనిస్తోందని నిర్మలా సీతారామన్ వివరించారు. స్థిరీకరణతో కూడిన అభివృద్ధి దిశగా భారత్ ముందుకు అడుగులు వేస్తోందని వెల్లడించారు.
వచ్చే 3 ఏళ్లలో ఏకలవ్య మోడల్ స్కూళ్ల కోసం 38, 800 టీచర్లను రిక్రూట్ చేస్తామని పేర్కొన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతామని తెలిపారు. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ది కోసం చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వెనకబడిన వర్గాలకు ఆర్థికంగా చేయూతను ఇస్తామని నిర్మల సీతారామన్ అన్నారు. విద్యార్థుల్లో విద్యపై ఆసక్తి కలిగించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎస్టీలకు రూ.15 వేల కోట్లను కేటాయించారు. దళితుల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వ్యవసాయ రంగానికి రుణ, మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని నిర్మల సీతారామన్ చెప్పారు. గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా 11.7 కోట్ల టాయిలెట్స్ నిర్మించామని పేర్కొన్నారు. 2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామని వివరించారు. మహిళా సాధికారత దిశగా భారత్ కృషి చేస్తుందని చెప్పారు. హరిత ఇంధనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. పీఎం ఆవాస్ యోజన పథకానికి 66 శాతం నిధులను కేటాయించామని తెలిపారు. రైల్వేలకు 2.40 లక్షల కోట్లు కేటాయించామని తెలిపారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట వేశారు. మౌలిక వసతుల అభివృద్దికి 33 శాతం నిధులను కేటాయించారు. 81 లక్షల స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేశామన్నారు. దేశవ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. మూలధనం కింద రూ.10 లక్షల కోట్లు అని ప్రకటించారు.