Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు మళ్లీ సమన్లు జారీ చేశారు. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి మార్చి 21న ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇవ్వడం వరుసగా ఇది తొమ్మిదోసారి. గత ఎనిమిది నోటీసులకు స్పందించని ఆయన విచారణకు హాజరు కాకుండా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌పై కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ జరిపిన ధర్మాసనం ఫిబ్రవరి 17న కోర్టుకు రావాలని ఆదేశించింది.
దీంతో ఆయన వర్చువల్‌గా కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే కేజ్రీవాల్‌కు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈడీ అభియోగాలపై విచారించిన కోర్టు.. అవి బెయిల్ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లేనని పేర్కొంటూ కేజ్రీవాల్‌కు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే ఈ కేసు విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఈమెకు ఈ నెల 23 వరకు కస్టడీ విధించింది. మార్చి 21న కేజ్రీవాల్ విచారణకు హాజరైతే కవితతో కలిపి ఆయన్ను విచారించాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.