»Israel Hamas War 20 Killed Over 155 Injured In Shelling While Awaiting Food Aid In Gaza
gaza : గాజాలో పరిస్థితి దయనీయం… ఆహారం కోసం ఎదురు చూస్తూ అనంత లోకాలకు!
యుద్ధం సామాన్యులపై ఎంత దుష్ప్రభావాలను చూపుతుంది అనడానికి గాజాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఆహారం దొరకడమూ కష్టమైపోతోంది. అలా ఆహారం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఓ గుంపుపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను చదివేయండి.
israel hamas war : ఇజ్రాయిల్, హమాస్ యుద్ధానికి కేంద్రంగా మారిన గాజాలో పరిస్థితులు రోజు రోజుకూ దయనీయంగా తయారవుతున్నాయి. అక్కడ నివసిస్తున్న ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ఎంతో కష్టపడాల్సి వస్తోంది. ఇలా ఆహారం కోసం ఎదురు చూస్తున్న ఓ గుంపుపై తాజాగా కాల్పులు జరిగాయి. దీంతో 20 మంది ప్రాణాలు వదిలారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరో 155 మంది వరకు గాయాలు అయినట్లు తెలుస్తోంది.
గాజాలోని(Gaza) అల్ షిఫా ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. ఎక్కువ సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రులకు చేరుతుంటే వారిని పర్యవేక్షించడమూ తమకు సాధ్యం కావడం లేదని స్థానిక వైద్యుడు మొహమ్మద్ ఘ్రాబ్ వెల్లడించారు. వారికి సరిపడినంత సరైన వసతులు, ఔషధాలు తమ వద్ద లేవని గాజా ఆరోగ్య శాఖ చెబుతోంది. దీంతో అక్కడ ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ విషయమై డిఫెన్స్ అధికార ప్రతినిధి మహమూద్బసల్ మాట్లాడారు. గాజా(Gaza) ఉత్తర భాగంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అక్కడ సామాన్యులు ఎవరైనా సాయం చేస్తారేమోనని ఆహారం కోసం కూడా ఎదురు చూస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. ఫిబ్రవరి 29వ తారీఖున సాయం కోసం ఎదురు చూస్తున్న వారిపై ఇజ్రాయిల్(Israel) వైమానిక దాడి జరపడంతో 104 మంది మరణించారు. 760 మంది గాయపడ్డారు. ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఎగబడిన వారిపై ఈ కాల్పులు జరిపింది.