JD : విశాఖ నార్త్ నుంచి పోటీ చేయనున్న జేడీ లక్ష్మీ నారాయణ
వచ్చే ఎన్నికల్లో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన పార్టీకి తాజాగా ఎన్నికల సంఘం నుంచి గుర్తు కూడా లభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
JD Lakshminarayana : సీబీఐ పూర్వ జేడీ(JD) వివి లక్ష్మీ నారాయణ విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఆయన జై భారత్ పార్ట అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆయన వెల్లడించారు. గురువారం ఆయన విశాఖ పట్నం ఎంపీపీ కాలనీ సెక్టార్-10లో ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
కార్యాలయ ప్రారంభం అనంతరం లక్ష్మీ నారాయణ(Lakshmi Narayana) విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ ద్వారా స్థానిక స్వ పరిమాలన పోయిందని అన్నారు. చట్టాల రూపకల్పనలో ప్రజల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదన్నారు.
గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన లక్ష్మీ నారాయణ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం జై భారత్ నేషనల్ పార్టీ పెట్టుకుని దాని నుంచి బరిలో దిగుతున్నారు. ఈ పార్టీకి తాజాగా ఎన్నికల సంఘం టార్చ్ లైట్(torch light) గుర్తును కేటాయించింది. తమకు ఈ గుర్తును కేటాయించడం పట్ల లక్ష్మీ నారాయణ స్పందించారు. ఈసీకి ధన్యవాదాలు చెప్పారు. తాము వచ్చే ఎన్నికల్లో టార్చ్లైట్ని వెలిగించి చీకటిని తరిమేస్తామని అన్నారు.