తనను తెలంగాణ నుంచి తరిమేస్తారా.. తరిమేయండి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అని తెలిపారు. తాను మాత్రం ధర్మ మార్గం విడవని ప్రకటించారు. విద్వేష ప్రసంగాలతో మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారంటూ తెలంగాణ పోలీసులు జారీ చేసిన నోటీసులపై మంగళవారం స్పందించారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. తన జీవితం ధర్మం కోసమేనని ప్రకటించారు. ఎక్కడో ముంబైలో మాట్లాడితే ఇక్కడ పోలీసులు నోటీసులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఓ వీడియో విడుదల చేశారు.
‘లవ్ జిహాద్, మత మార్పిడులు, గో హత్యలపై చట్టం తీసుకురావాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీకు ఎందుకు బాధ? అది కూడా మహారాష్ట్రలో జరిగిన సభలో మాట్లాడాను. మీకు ఎందుకు బాధ అని అడుగుతున్నా. రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాను. మంచి జీవితం పొందాను. ఇప్పుడు నాది ఒక్కటే లక్ష్యం. ధర్మం గురించి చావాలి.. ధర్మం గురించి బతకాలి. మీరు జైలుకు పంపిస్తారా? తెలంగాణ నుంచి తరిమేస్తారా? ఏం చూస్తారో చూద్దాం. నేను సిద్ధం’ అని మాట్లాడిన వీడియోను రాజాసింగ్ విడుదల చేశారు.
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రాజా సింగ్ వార్తల్లో నిలుస్తున్నాడు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి. దీనిపై తెలంగాణ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కొన్ని జైల్లో ఉండి వచ్చిన రాజాసింగ్ ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించగా.. వాటిని రాజాసింగ్ ఉల్లంఘించాడని పోలీసులు పేర్కొంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అతడికి నోటీసులు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఇదే వైఖరి కొనసాగితే మరోసారి రాజా సింగ్ ను అరెస్ట్ చేయక తప్పదని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.