Six గ్యారంటీలకు నిధులు ఎక్కడినుంచి తెస్తారు.. రాజా సింగ్
ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ విధిగా అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఆ అంశంపై తాము పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణం చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
BJP Mla Raja Singh: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేగా రాజా సింగ్ ( Raja Singh) ప్రమాణం చేశారు. ప్రోటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఉండగా ప్రమాణం చేయని సంగతి తెలిసిందే. రాజా సింగ్ సహా బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు గురించి అడిగారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు 6 గ్యారెంటీలనె వెంటనే అమలు చేయాలని రాజా సింగ్ ( Raja Singh) డిమాండ్ చేశారు. ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం రెండు హామీలను అమలు చేసింది. మరో 4 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెబుతోంది. హామీలు అమలు చేసేందుకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని రాజా సింగ్ అడిగారు. ఇటలీ నుంచి తెస్తారా..? లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి తెస్తారా అని అడిగారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. అలాగే మజ్లిస్, కాంగ్రెస్ ఒక్కటేనని కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వంతో మజ్లిస్ కలిసి ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ నుంచి అసెంబ్లీ ప్లోర్ లీడర్ ఎవరనే అంశాన్ని పార్టీ నిర్ణయిస్తోందని తెలిపారు. ఫ్లోర్ లీడర్ ఎవరైనా సరే అందరం కలిసి పనిచేస్తామని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతానని తాను అనలేదని రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారని కామెంట్స్ చేశారు. అంతే తప్ప తాను అనని మాటలను ఆపాదించొద్దు అని సూచించారు.