Temple for Revanth Reddy : అభిమానం కట్టలు తెంచుకున్నప్పుడు వారికి గుడి కట్టే సంప్రదాయం మన దేశంలో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. రాజకీయ నాయకులు, సినిమా స్టార్లకు గుడులు కట్టిన సన్నివేశాలను మనం అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇదే దారిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిమానులు కూడా పయనిస్తున్నారు. తమ అభిమాన నేతకు గుడి(Temple) కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గుడి(Revanth Reddy Temple) కట్టాలని ఆ రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని వారు మీడియాకు వెల్లడించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో ఈ గుడి కట్టేందుకు స్థలాన్ని కేటాయించుకున్నారు. దానికి మార్చి 19 ఉదయం 9 గంటలకు భూమి పూజ జరుగుతుందని వారు వెల్లడించారు.
రెడ్డి సంఘం నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ రోజున పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ విషయమై ఆ నాయకులు మాట్లాడుతూ… కనిపించని దేవుడి కంటే కనిపించే దేవుడు రేవంత్ రెడ్డి అని వారు అంటున్నారు. అందుకనే గుడి కట్టాలని నిశ్చయించుకున్నామన్నారు. ఈ భూమి పూజలకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. ఇలాగే మన దేశంలో నరేంద్ర మోదీ, సోనియా గాంధీ, ఎంజీఆర్, మాయావతి, కుష్బూ, జయలలిత.. తదితరులకూ అభిమానులు గుడులు(Temples) కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.