ప్రతిపక్షాలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శల దాడి పెంచాడు. తన పాలన వైఫల్యాలపై మూకుమ్మడిగా దాడి చేస్తుండడంతో జగన్ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పొత్తులు లేవని.. తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయని.. తాను సింహంలా ఒక్కడినే వస్తానని చెప్పారు. తనకు భయం లేదని.. ప్రజలను, దేవుడిని నమ్ముకున్నట్లు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో సోమవారం జగనన్న చేదోడు మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు బటన్ నొక్కి డబ్బులు పంపిన అనంతరం సీఎం జగన్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిట్టని వాళ్లు శ్రీలంక అయిపోతోందని దుష్ప్రచారం చేస్తున్నారు.. కానీ ఇప్పుడు ఏపీ దేశానికే దిక్సూచిగా నిలిచిందని చెప్పారు. గతంలో గజదొంగల ముఠా ఏపీని దోచేసిందని ఆరోపించారు. ఈనాడు, టీవీ 5, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, దత్తపుత్రుడు వీళ్లంతా గజదొంగల ముఠా. మరి వీళ్లు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. ఎందుకంటే వాళ్ల విధానం డీపీటీ అని తెలిపారు. డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో అని కొత్త అర్థం చెప్పారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ఏం చేశాడో చూశారు కదా అని పేర్కొన్నారు. తోడళ్లన్నీ ఒక్కటవుతున్నాయి.. సింహంలా మీ బిడ్డ ఒక్కడే నడుస్తున్నాడు అని సీఎం జగన్ తెలిపారు.