Indians In Russian Army : చాలా మంది భారతీయులు రష్యా(Russia) సైన్యంలో సహాయకులుగా పని చేయడానికి సంతకాలు చేసి ఇక్కడికి వెళ్లారు. అయితే ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో తమను పాల్గొనవలసిందిగా ఆర్మీ వారు ఒత్తిడి తెస్తున్నారంటూ ఇటీవల కొన్ని వీడియో సందేశాలు భారత్‌కు చేరాయి. తమను రక్షించాలంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖకు పలు అభ్యర్థనలు వచ్చాయి. దీంతో తమ భారతీయులను ఈ విధుల నుంచి తప్పించాలని భారత్ రష్యాను కోరింది.
ఈ క్రమంలో మాస్కోలోని అధికారులతో మన విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. దీంతో కొంత మంది భారతీయులను సైనిక సేవల నుంచి తప్పించినట్లు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ దృష్టికి వస్తున్న కేసులు అన్నింటినీ పరిష్కరించేందుకే ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
ఉక్రెయిన్ యుద్ధం(ukraine war)లో భారతీయులను ఉపయోగిస్తున్నారని, ఈ క్రమంలో రష్యాలో ఒక భారతీయుడు కూడా మృతి చెందాడని అంతర్జాతీయ మీడియాలోనూ పలు వార్తలు, కథనాలు వస్తున్నాయి. అయితే ఆ కథనాల్లో స్పష్టత లేదని, తమ వద్దకు వచ్చిన కేసులను మాత్రం తాము పరిష్కరించగలుగుతున్నామని విదేశాంగ శాఖ తెలుపుతోంది. ఈ క్రమంలో రష్యా అధికారులతో తాము నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు చెబుతోంది. భారత్‌లోనైనా, మాస్కోలోని భారత రాయబార కార్యాలయం దృష్టికి వచ్చిన ప్రతి కేసును రష్యా అధికారులతో చర్చిస్తున్నామంది. దిల్లీలోని రష్యా రాయబార కార్యాలయంతోనూ సమన్వయం చేసుకుంటున్నామని తెలిపింది. ఇప్పటికే చాలా మంది భారతీయులను రష్యా సైన్యం నుంచి తప్పించారని, వీలైనంత తొందరగా మిగిలిన కేసులను పరిష్కరిస్తామని వివరించింది.