ట్విట్టర్ యూజర్లకు ఎలన్ మస్క్ శుభవార్తను అందించారు. ట్విట్టర్ లో ఆడియో, వీడియో కాల్స్ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. ఇందుకుగాను ఆయన ట్వీట్ చేశారు. “ట్విట్టర్ ప్లాట్ ఫారమ్ లో వాయిస్, వీడియో చాట్ త్వరలో అందుబాటులోకి రానున్నాయి, కాబట్టి మీరు మీ ఫోన్ నెంబర్ ను అవతలి వ్యక్తికి ఇవ్వకుండానే ప్రపంచంలోని ఏ వ్యక్తితోనైనా మాట్లాడవచ్చు” అని మస్క్ తెలిపారు. మోటా యాజమాన్యంలోని వాట్సప్ మెసేజింగ్ సర్వీస్ ఆధారపడలేమని ఆయన పేర్కొన్నారు.
ఆడియో, వీడియో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావడం వలన మెసెంజర్, సిగ్నల్, టెలిగ్రామ్ మరియు వాట్సాప్ వంటి వివిధ ఉచిత సేవలతో ట్విట్టర్ పోటీ పడనుంది. బుధవారం నుంచి, ట్విట్టర్ మెసేజ్ కంటెంట్లను స్క్రాంబ్లింగ్ చేయడం ద్వారా గోప్యతా రక్షణను మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యక్ష సందేశాలను ఎన్‌క్రిప్ట్ చేయడం ప్రారంభిస్తుందని మస్క్ వెల్లడించారు.
ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలన్ మస్క్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆయన ఆశ్చర్యకరమైన ప్రకటనలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రకటించిన ఆడియో, వీడియో కాల్స్ గురించి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలోన్ మస్క్ “ట్విట్టర్ 2.0 ది ఎవ్రీథింగ్ యాప్” కోసం ప్లాన్ చేసిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఈ ప్రకటనను చేశారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఎన్క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్‌లు (DMలు), లాంగ్‌ఫార్మ్ ట్వీట్లు మరియు చెల్లింపులు వంటి ఫీచర్లు ఉంటాయని మస్క్ చెప్పారు.