టీమిండియా క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లను సోషల్ మీడియాలో నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేశారు. క్రికెటర్లు సిరాజ్, ఉమ్రాన్ లకు నుదటిపై తిలకం పెట్టడానికి యత్నిస్తే, వారు నిరాకరించారని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. భారత క్రికెటర్ల బృందం మ్యాచ్ ఆడేందుకు భారతదేశంలోని ఓ నగరంలోని హోటల్ కు రాగా అక్కడ హోటల్ సిబ్బంది క్రికెటర్లకు నుదిటిపై తిలకం దిద్ది స్వాగతం పలికారు. అలా హోటల్ సిబ్బంది తిలకం పెట్టబోతుండగా సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లు వద్దన్నారు.
భారతదేశంలో అతిథులకు నుదుట తిలకం దిద్ది స్వాగతం పలకడం హిందూ సంప్రదాయం. తిలకాన్ని నిరాకరించిన క్రికెటర్లపై నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లతోపాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, క్రికెట్ జట్టు సహాయక సిబ్బందిలో మరోకరు కూడా తిలకం పెట్టించుకోవడానికి నిరాకరించారు. అయినా ఆన్ లైన్ లో అభిమానులు మాత్రం సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లనే లక్ష్యంగా చేసుకొని ట్రోలింగ్ చేస్తున్నారు. భారత క్రికెటర్ అయిన ముహమ్మద్ సిరాజ్ 15 టెస్టుల్లో 46 వికెట్లు తీశారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన హైదరాబాదీ సిరాజ్ తిలకం నిరాకరించి సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచారు.