పెళ్లి అన్నాక హడావిడి ఉండటం చాలా సహజం. ఈ పెళ్లిలో భోజనాల విషయంలో చాలా సార్లు గొడవలు జరగడం మీరు వినే ఉంటారు. ముఖ్యంగా చికెన్, మటన్ ముక్కల కోసం ఎక్కువ సార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి. దాని కోసం కొట్టుకున్నవారు కూడా ఉన్నారు. కానీ మీరు.. పెళ్లి భోజనంలోని అప్పడం కోసం గొడవ పడటం ఎప్పుడైనా విన్నారా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. అప్పడం కోసం గొడవ పడ్డారు. ఆ గొడవ కాస్త పెద్ద రణ రంగానికి దారి తీసింది. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అలప్పూజ జిల్లాలోని ముట్టమ్ పట్టణానికి చెందిన యువతితో.. త్రికూనప్పూజకు చెందిన యువకుడితో వివాహం జరిగింది. రెండు రోజుల కిందట ఓ కళ్యాణ మండపంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. వివాహతంతు ముగిసిన తర్వాత విందు మొదలైంది. వధువు కుటుంబం విందును ఏర్పాటుచేయడంతో వరుడి తరఫువారు భోజనాలు చేస్తున్నారు. ఈ సమయంలో తనకు పాపడ్ కావాలని వరుడి స్నేహితుడు అడిగితే వధువు తరపువారు ససేమిరా అన్నారు.
దీంతో మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. గొడవ పెద్దది కావడంతో కళ్యాణ మండపం యజమాని మురళీధరన్ అక్కడకు చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇరు వర్గాలూ సంయమనం కోల్పోయి ఆయనపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన తలకు గాయమై ఆస్పత్రిలో చేరారు. అప్పటి వరకూ ఎంతో సరదాగా ఉన్న మండపం ఈ ఘటనతో ఒక్కసారి రణరంగంగా మారిపోయింది. అక్కడున్న వారంతా కొట్టుకొవడం మొదలేట్టారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
బాధితుడు మురళీధరన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 15 మందిపై కేసు నమోదుచేశారు. గొడవ కారణంగా కుర్చీలు, టేబుళ్లు, ఇతర సామాగ్రీ ధ్వంసమై రూ.1.50 లక్షలు నష్టం వాటిళ్లిందని యజమాని వాపోయాడు.