గుజరాత్(Gujarat)లో వీధి కుక్కలు కోట్లకు పడగలెత్తాయి. ఏకంగా రూ.90 కోట్ల ఆస్తి(Property)కి హక్కుదారులయ్యాయి. వాటి ఆస్తి నిర్వహణకు ఓ ట్రస్టు ఉంది. దీంతో ఆ గ్రామసింహాల లైఫ్‌స్టైలే (Lifestyle) మారిపోయింది. పెంపుడు కుక్కలు కూడా అసూయ పడేస్థాయిలో అవి రాజభోగాలు అనుభవిస్తున్నాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. మెహసానా జిల్లా(Mehsana District) ఇందుకు వేదిక అయ్యింది. జంతువులకు సేవ చేస్తే తమకు శుభం జరుగుతుందని జిల్లాలోని పంచోత్ గ్రామ ప్రజల బలమైన నమ్మకం. దీంతో, నిత్యం కళ్లెదురుగా ఉండే వీధి కుక్కలకే సేవచేయాలని వారు నిర్ణయించుకున్నారు. వాటి కోసం ఓ ట్రస్ట్(Trust) ఏర్పాటు చేసి భారీ మొత్తాలను విరాళంగా ఇవ్వడం మొదలెట్టారు. కొందరు ఏకంగా కోట్ల రూపాయల విలువైన తమ ఆస్తులనే ఆ ట్రస్టుకు ధారాదత్తం చేశారు.
ఇక కుక్కల సేవ కోసం భారీ యంత్రాంగమే ఏర్పాటు చేసుకున్నారు. శునకాల(Dogs)కు ఆహారం తయారు చేసేందుకు కొందరు మహిళలను నియమించుకున్నారు. వారు రోజుకు వెయ్యి రొట్టెలు చేస్తారు. వీటిని వలంటీర్లు శునకాలకు ఇస్తుంటారు. శునకాలు అనారోగ్యం పాలైనప్పుడు లేదా గాయపడినప్పుడు వాటికి వైద్యం చేసేందుకు ఓ పశు వైద్యుడి(Veterinarian)ని కూడా ఈ ట్రస్ట్ నియమించింది. గ్రామ సింహాలకు 24 గంటల పాటు వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని పశు వైద్యుడు రామ్‌సింగ్ (Ram Singh) బిష్ణోయ్ తెలిపారు. ఎప్పుడు జంతువులను తీసుకొని వచ్చినా వైద్యం చేస్తామన్నారు. ఈ గ్రామంలో ప్రతి ఇంటిలోనూ కుక్కలు ఉన్నాయని చెప్పారు. శునకాలతో పాటు పశువుల (cattle) బాగోగులను కూడా ఈ ట్రస్టు చేపడుతోంది. రానున్న రోజుల్లో పక్షుల కోసం గూళ్లు కూడా నిర్మించాలని ఈ ట్రస్టు యోచిస్తోందని ఆయన అన్నారు.