ఖమ్మం గడ్డపై రేపు కాంగ్రెస్ జన గర్జన సభ, పార్టీలో జోష్ నింపిన భట్టి పాదయాత్ర
ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే జన గర్జన సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారు. 108 రోజుల పాటు పాదయాత్ర చేసి.. కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను సత్కరిస్తారు.
Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగిసింది. మార్చి 16వ తేదీన ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకర్గం పిప్రలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. 108 రోజుల పాటు విజయవంతంగా కొనసాగి.. శనివారం ఖమ్మం జిల్లాలో ముగిసింది. రేపు ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభలో భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ సన్మానిస్తారు.
భట్టి విక్రమార్క పీపుల్ మార్చ్ (people march) పాదయాత్ర కాంగ్రెస్ పార్టీలో ఊపు తీసుకొచ్చింది. 17 జిల్లాలు, 36 నియోజకవర్గాలు, 750 గ్రామాల మీదుగా 1350 కిలోమీటర్ల మేర భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు. ఆయన యాత్రకు జనం నుంచి మంచి స్పందన లభించింది. పాదయాత్రలో భారీగా యువత, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పాదయాత్ర ముగింపు రోజు నిర్వహించే జన గర్జన సభలో సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరతారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, గురునాథ్ రెడ్డి హస్తం పార్టీలో చేరతారు. దాదాపు 30 నుంచి 35 మంది కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ పేరుతో ఇదివరకు ఓ నోట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విజయవాడలో గల గన్నవరం ఎయిర్ పోర్టుకు రేపు సాయంత్రం చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో ఖమ్మం వస్తారు. సభ వేదికపై భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ సత్కరిస్తారు. ఈ సభతో తమ బలం చూపించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందరం కలిసే ఉన్నామనే సంకేతాలను ఇస్తున్నారు.