వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు.. దాని అర్థమేంటో తెలుసా.. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యుడు దేవుడితో సమానం అని అర్థం. అయితే.. ప్రస్తుత రోజుల్లో ఈ మాటను ఎవరూ అలా భావించడం లేదు. ఎందుకంటే… ఇప్పుడు ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. ఏం చేస్తే డబ్బు వస్తుందా అని ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ.. ఓ మనిషి ప్రాణాలు కాపాడాలి అనే ఆలోచన చాలా మందిలో ఉండటం లేదు. అయితే.. ఇలాంటి రోజుల్లో కూడా.. తమ కన్నా… హాస్పిటల్ లో ఉన్న రోగి ప్రాణాలు కాపాడటం చాలా ముఖ్యమని భావించాడు ఓ వైద్యుడు. అందుకోసం బెంగళూరులోని ఓ వైద్యుడు ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం…
మణిపాల్ హాస్పిటల్స్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ అయిన డాక్టర్ గోవింద్ నందకుమార్ ఆగస్టు 30న అత్యవసర ల్యాప్రో స్కోపిక్ పిత్తాశయ శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. ఈ ఆపరేషన్ చేసేందుకు ఆయన ఆస్పత్రికి వెళ్లుండగా… సర్జాపూర్-మారాతల్లి మార్గంలో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు.
ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యి.. ఆస్పత్రికి వెళ్లాంటే.. చాలా సమయం పడుతుంది. అదే జరిగితే.. హాస్పిటల్ లో ఉన్న రోగి ప్రాణాలు పోతాయి. అందుకు.. ఆ డాక్టర్ మరుక్షణం ఆలోచించకుండా ఓ నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ కారణంగా ఆ మహిళా రోగి ప్రాణాలు కోల్పోకూడదని భావించిన ఆయన దాదాపు మూడు కిలో మీటర్లు తన కారును అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ.. సదరు మహిళకు ఆపరేషన్ చేశాడు.
“నేను ప్రతిరోజూ సెంట్రల్ బెంగుళూరు నుండి బెంగుళూరుకు ఆగ్నేయంలో ఉన్న మణిపాల్ హాస్పిటల్స్, సర్జాపూర్‌కి ప్రయాణిస్తాను. నేను సర్జరీకి సమయానికి ఇంటి నుండి బయలుదేరాను. నా బృందం అంతా సిద్ధంగా ఉంది. నేను చేరుకోగానే శస్త్రచికిత్స చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ భారీ వర్షాల కారణంగా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్ క్లియర్ కాదని అర్థమై రెండోసారి కూడా ఆలోచించకుండా.. కారు, డ్రైవర్ ని అక్కడే వదదిలేసి.. హాస్పిటల్ వైపు పరిగెత్తాను.’’ అని డాక్టర్ నంద కుమార్ చెప్పారు.
పేషెంట్‌కి అనస్థీషియా వేయడానికి సిద్ధంగా ఉన్న డాక్టర్ నందకుమార్ బృందం ఆపరేషన్ థియేటర్‌కు చేరుకోగానే రంగంలోకి దిగింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. ఆయన ఆపరేషన్ కి రెడీ అయ్యి.. వెంటనే ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స విజయవంతమైంది. రోగిని సమయానికి డిశ్చార్జ్ చేశారు.
డాక్టర్ నందకుమార్ మణిపాల్ హాస్పిటల్స్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. చాలా కాలంగా పిత్తాశయ వ్యాధితో బాధపడుతుండడంతో రోగికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. కాగా.. ఆయన చేసిన పని పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.