తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ పైన ధ్వజమెత్తారు. ప్రధానిస్థాయి నేత తమ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ మాట్లాడారని ఆదివారం నాటి పాలమూరు బహిరంగ సభలో ఆరోపించారు. దీనికి బీజేపీ కూడా ఘాటుగానే స్పందించింది. ప్రధాని అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకున్నదని, అందుకే ఉలిక్కిపడుతున్నారని, అభద్రతాభావంలో ఉన్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
కొన్నాళ్లుగా మాటల యుద్ధం
గత కొన్నాళ్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి లేదా భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ మాటల యుద్ధం దాడుల వరకు వెళ్లిన పరిస్థితులను చూశాం. కేసీఆర్ అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీ పైన ఒంటికాలి పైన లేస్తున్నారు. గత కొంతకాలంగా టీఆర్ఎస్ నేతలపై ఐటీ, సీబీఐ, ఈడీ సోదాలు, విచారణలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించాయి. గంగుల కమలాకర్, మల్లారెడ్డిలపై విచారణ సంస్థల సోదాల అనంతరం, దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు తెరపైకి రావడం, సీబీఐ మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కవిత మంగళవారం సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఎఫ్ఐఆర్ ఫైల్, కేసు వివరాలు ఇవ్వాలని కవిత కోరారు. ఈ వివరాలు ఆమెకు అందించాక ఆమెను హైదరాబాద్‌లో సీబీఐ విచారించే అవకాశముంది. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సంచలనం రేపింది.
ముందస్తు ఊహాగానాలు
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ముందస్తుకు వెళ్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. మునుగోడు ఉపఎన్నికల్లో గెలుపు తర్వాత.. కేసీఆర్ ముందస్తుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగింది. అయితే కేసీఆర్ మాత్రం ఆ ప్రచారాన్ని కొట్టి పారేశారు. కానీ ఆ తర్వాత విచారణ సంస్థల సోదాల అంశం వేడి రాజేయడంతో మళ్లీ ముందస్తుపై చర్చ సాగుతోంది. ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల పేరుతో టీఆర్ఎస్ నేతలను బీజేపీ ఒత్తిడికి గురి చేస్తోందని, ఇది ఇలాగే కొనసాగితే పలువురు నేతలు పార్టీ మారే అవకాశాలు కొట్టి పారేయలేమని, అలాంటి అవకాశం తమ నేతలకు ఇవ్వకుండా కేసీఆర్ ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ రద్దు ప్రకటన చేసే అవకాశాలు లేకపోలేదనే వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
నేతలు చేజారకుండా
ఇప్పటికే బీజేపీ… కాంగ్రెస్ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి తదితర కీలక నేతలను చేర్చుకొని, టీఆర్ఎస్కు సవాల్ విసురుతోంది. అంతకుముందు టీఆర్ఎస్ నుండి ఈటల రాజేందర్ వంటి నేతలు కమలం తీర్థం పుచ్చుకున్నారు. మునుగోడులో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీగా భావించే టీఆర్ఎస్ నేతలు, ప్రస్తుత విచారణ సంస్థల దాడుల నేపథ్యంలో బీజేపీ వైపు చూస్తే మొదటికే మోసం వస్తుందని కేసీఆర్ అండ్ కో భావిస్తున్నారని అంటున్నారు. మల్లారెడ్డి వంటి ఆర్థిక పరిపుష్టి కలిగిన నేతలు, ప్రజాబలం కలిగిన నేతలు బీజేపీ వైపు చూస్తే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఆర్థిక ఇబ్బందులు, ప్రజా బలం కలిగిన నేతలు లేక ఇబ్బంది తలెత్తవచ్చు. విచారణ సంస్థల టార్గెట్ ఇలాగే కొనసాగితే పార్టీ నేతలు ఎన్నికల సమయం వరకు ఉంటారా? అనే ఆందోళన కేసీఆర్‌లో ఉండవచ్చునని అంటున్నారు. వీటిని పరిగణలోకి తీసుకొని, కేసీఆర్ ముందస్తుకు వెళ్లే అవకాశాలు కొట్టి పారేయలేమని కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
లాభనష్టాల బేరీజు
కేసీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తున్నారు. తెలంగాణలో ఎక్కడైనా అభివృద్ధి జరగలేదు అంటే అందుకు కేంద్రమే కారణమని బూచిగా చూపే ప్రయత్నం మరింత బలంగా చేస్తున్నారని, తద్వారా ప్రజల నుండి సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. నేను మీతే ఉంటాను.. మీరు కూడా నాతో ఉండాలని, ఆశీర్వదించాలని వ్యాఖ్యానించారు కేసీఆర్. ఓ వైపు తమ ఎమ్మెల్యేలు, నేతలు బీజేపీ వైపు మరలకుండా, మరోవైపు ప్రజల నుండి సానుభూతి పొందే ప్రయత్నాలు… ముందస్తుకు సంకేతాలు కావొచ్చునని అంటున్నారు. అయితే ముందస్తుకు వెళ్తే లాభమా, డిసెంబర్లో సమయానికి ఎన్నికలకు వెళ్తే లాభమా? అన్నీ ఆలోచించుకొనే కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పవచ్చు.