KTR: రక్షణశాఖ భూముల కోసం పట్టు, అవే ఎందుకు అంటున్న మేధావులు
తెలంగాణ ప్రభుత్వం భూముల విక్రయించి సొమ్ము చేసుకుంటుంది. రక్షణశాఖ భూములను కావాలని అంటోంది. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను మంత్రి కేటీఆర్ కలిసి విన్నవించారు. స్కై వేకోసం ఆ భూమి కావాలని.. అదే రేటు ఉన్న మరో చోట భూమి ఇస్తామని చెబుతున్నారు.
KTR: తెలంగాణ ప్రభుత్వం భూముల విక్రయంపై ఫోకస్ చేసింది. భూములను విక్రయించి ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. కోకాపేటలో 1.65 ఎకరాలకు పైగా భూములు విక్రయించి రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని హెచ్ఎండీఏ పొందింది. పోచారం, బండ్లగూడ ప్రాంతంలో రాజీవ్ స్వగృహ ప్లాట్ల విక్రయం కోసం వేలం నిర్వహించింది. మిగతా చోట్ల కూడా భూముల విక్రయించి ఆదాయం రాబట్టుకోవాలని భావిస్తోంది. 2022-23లో 10 వేల కోట్ల విలువగల భూములను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.6900 కోట్ల ఆదాయం వచ్చింది. 2023-24లో కొనసాగిస్తూ.. ఆ లక్ష్యాన్ని 13 వేల కోట్లకు పెంచుకుంది. పైకి ఆదాయం అని చెబుతోంది. అభివృద్ది మాత్రం జరగడం లేదు. రోడ్ల ఆధునీకీకరణ లేదు. ట్రాఫిక్ సమస్య తీరడం లేదు. స్కై వే అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన సమయంలో చెప్పి.. ఇప్పుడు.. ఉప్పల్లో ఒకటి పూర్తి చేశారు. మహానగర రోడ్లపై ట్రాఫిక్ చిక్కులు తీరడం లేదు.
ఆ భూములు కావాలి
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ను కలిసిన ఆయన..భూముల విషయంలో హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందదని.. అయినను పోవాలె హస్తినకు కదా అందుకే వచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. తెలంగాణ అభివృద్దికి ఆటంకం కలిగించొద్దు అని కేటీఆర్ సూచించారు. స్కై వేల కోసం రక్షణశాఖ భూములు ఇవ్వాలని మరోసారి కోరారు. గత 9 ఏళ్లుగా అడుగుతున్న కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రాజీవ్ రహదారి వద్ద 96 ఎకరాల భూమి అవసరం అవుతుందని.. అదే రేటు ఉండే భూమి మరో చోట ఇస్తామని రక్షణశాఖ మంత్రికి చెప్పామని కేటీఆర్ వివరించారు. ప్యాట్నీ వద్ద మరో స్కై వే అవసరం అవుతుందని.. ఇక్కడ కూడా రక్షణశాఖ భూమి అవసరం అవుతుందని చెప్పారు. ఇదీ కడితే హైదరాబాద్, నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఉప్పల్లో ఓ స్కై వే పూర్తయ్యిందని.. సోమవారం దానిని ప్రారంభిస్తామని తెలిపారు. మెహిదీపట్నం రైతు బజార్ వద్ద మరో స్కై వే అవసరం అవుతుందని.. అక్కడ కూడా అర ఎకరం రక్షణశాఖకు చెందిన స్థలం అవసరం అవుతుందని కేటీఆర్ అంటున్నారు.
లింక్ రోడ్స్ కూడా
సిటీలో 142 లింక్ రోడ్స్ అవసరం అవుతున్నాయి.. 2,3 చోట్ల రక్షణశాఖ భూములు అడ్డు వస్తున్నాయని తెలిపారు. రసూల్ పురలో కూడా భూమి అవసరం ఉందని వివరించారు. మిగతా రాష్ట్రాలు, నగరాల్లో నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని.. తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులపై మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందని తెలిపారు. మెట్రో ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇలానే జరుగుతుందని చెప్పారు. ఎయిర్ పోర్టు వరకు మెట్రో పనులను తెలంగాణ ప్రభుత్వమే చేపడుతోందని స్పష్టంచేశారు. రక్షణశాఖ భూములు కావాలని ఎందుకు అడుగుతున్నారని.. ఉన్న భూములను విక్రయిస్తున్నారని కొందరు మేధావులు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.