»Us Consulate Implements New Visa Appointment Policy In Hyderabad
US Visa జారీలో కొత్త విధానం.. ఎల్లుండి నుంచి హైదరాబాద్‌లో అమలు
అమెరికా వెళ్లే విద్యార్థులు, ఇతరులు వీసా అపాయింట్ మెంట్ కోసం పాస్ పోర్ట్‌లో ఉన్న కచ్చితమైన వివరాలను పేర్కొనాలని ఎంబసీ పేర్కొంది. లేదంటే అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అవుతుందని స్పష్టంచేసింది.
US Consulate implements new visa appointment policy in Hyderabad
US Visa: వీసా (US Visa) అపాయింట్ మెంట్ విధానంలో మోసం, అపాయింట్ మెంట్ దుర్వినియోగం కావొద్దనే ఉద్దేశంతో అమెరికా ఎంబసీ (US Visa) కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల 27వ తేదీ నుంచి హైదరాబాద్‌లో గల యూఎస్ కాన్సులేట్, ఇతర నగరాల్లో అమల్లోకి రానుంది. ఈ మేరకు భారతదేశంలో గల అమెరికా ఎంబసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎఫ్, ఎమ్, జే విద్యార్థి వీసా దరఖాస్తు చేసే వారు ప్రొఫైల్ రూపొందించే సమయంలో, వీసా అపాయింట్ మెంట్ షెడ్యూల్ చేసే సమయంలో సొంత పాస్ పోర్ట్ సమాచారాన్ని తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. ప్రొఫైల్ లేదా అపాయింట్ మెంట్ చేసే సమయంలో పాస్ పోర్ట్ వివరాలను తప్పుగా పేర్కొంటే వీసా దరఖాస్తు కేంద్రం (వీఏసీ) తిరస్కరిస్తోందని స్పష్టంచేసింది. దీంతో వారి అపాయింట్మెంట్ రద్దు అవుతోందని తేల్చిచెప్పింది. వీసా కోసం చెల్లించిన ఫీజు కూడా తిరిగి చెల్లించబడదని హెచ్చరించింది.
కొన్ని సందర్భాల్లో అనుకోకుండా తప్పులు జరుగుతుంటాయి. అలాంటి వారికి అమెరికా ఎంబసీ ఒక్క అవకాశం కల్పించింది. మరోసారి పాస్ పోర్ట్ వివరాలతో కొత్త ప్రొఫైల్ రూపొందించుకోవాలని సూచించింది. లేదంటే పాత ప్రొఫైల్‌కు కచ్చితమైన సమాచారంతో అపాయింట్ మెంట్ రీ షెడ్యూల్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. పాస్ పోర్ట్ సమాచారం మార్చేందుకు ఫీజు ముందటి పాస్ పోర్ట్ డేటాతో లింక్ చేయబడి ఉంటే కొత్త వీసా కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పాత పాస్ పోర్ట్ పోగొట్టుకున్న వారు.. లేదంటే పాస్ పోర్ట్ దొంగతనానికి గురైతే ఆ తర్వాత పాస్ పోర్ట్ పునరుద్దరించిన లేదంటే కొత్తగా పాస్ పోర్ట్ పొందిన దరఖాస్తుదారులకు ఈ పాలసీ వర్తిస్తోంది. అలాంటి వారు తమ పాత పాస్ పోర్ట్ నంబర్ జిరాక్స్ లేదంటే ఇతర సాక్ష్యాలను సంబంధింత అమెరికా ఎంబసీ సెంటర్లో సమర్పించాల్సి ఉంటుంది. దీంతో వారి కొత్త షెడ్యూల్, అపాయింట్ మెంట్ కొనసాగుతుందని అమెరికా ఎంబసీ స్పష్టం చేసింది.
అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలి అనుకునే విద్యార్థులు, ఇతరులు ఇక వీసా అపాయింట్ మెంట్ సమయంలో కచ్చితమైన సమాచారం పేర్కొనాల్సి ఉంటుంది. ఏ చిన్న తప్పును కూడా ఎంబసీ తీసుకోదు. సో.. జాగ్రత్తగా దరఖాస్తు చేయాలని కన్సల్టెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు. చేసే చిన్న తప్పిదం వల్ల.. వీసా రద్దయ్యే అవకాశం ఉంది. ఒకసారి తప్పు చేస్తే ఛాన్స్ ఇచ్చారు.. రెండోసారి జరిగితే అవకాశం ఇవ్వకపోవచ్చని అభిప్రాయ పడుతున్నారు.