6.4 million illegal immigrants living in US, 725,000 are Indians: Study
US: అమెరికా (US) వెళ్లి స్థిరపడాలని చాలామంది కలలు కంటారు. పై చదువు, జాబ్ కోసం వెళ్లేవారు చాలా మంది ఉన్నారు. అయితే చాలా మంది అక్రమంగా ఆ దేశంలో నివసిస్తున్నారని తెలిసింది. అక్రమ వలస దారుల్లో భారతీయులు కూడా ఉన్నారట. అమెరికాలో (america) మెరుగైన జీవనోపాధి, విస్తృత అవకాశాల కోసం వస్తుంటారు.
ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఓ అధ్యయనంలో అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారుల జనాభాలో భారతీయులు మూడో స్థానంలో ఉన్నట్లు తేలింది. వాషింగ్టన్కు చెందిన థింక్ ట్యాంక్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. అమెరికాలో ప్రస్తుతం 7.25 లక్షల మంది భారతీయలు అక్రమంగా నివసిస్తున్నారని తేలింది.
అత్యధికంగా మెక్సికో నుంచి 2017-2021 మధ్య అక్రమ వలస దారులు అమెరికాలోకి చేరినట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. ఆ తర్వాత 8 లక్షల మంది అక్రమ వలసదారులు ఎల్ సాల్విడార్ నుంచి అమెరికాలోకి చొరబడినట్లు పేర్కొంది. 2017 నుంచి అక్రమంగా అమెరికాలో చేరుతున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధ్యయనంలో తేలింది.
గత ఏడాది అక్టోబరు 1వ తేదీ నుంచి ఈ సెప్టెంబరు 30వ తేదీ మధ్య అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నం చేసి దొరికిపోయిన భారతీయుల వివరాలను అమెరికా విడుదల చేసింది. మొత్తం 96,917 మంది భారతీయులు ఎలాంటి అనుమతులు లేకుండా సరిహద్దు దాటేందుకు ప్రయత్నించి దొరికిపోయారని.. వారిని అరెస్టు చేశామని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ 97 వేల మందిలో 30 వేల మంది కెనడా సరిహద్దు వద్ద.. దాదాపు 42 వేల మంది మెక్సికో సరిహద్దు వద్ద పట్టుబడినట్లు తెలిపింది.